మెప్మాలో మహిళా ఉద్యోగికి వేధింపులు | - | Sakshi
Sakshi News home page

మెప్మాలో మహిళా ఉద్యోగికి వేధింపులు

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్‌

నరసరావుపేట: పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో ఐబీగా విధులు నిర్వహిస్తున్న మహిళ జూనియర్‌ అసిస్టెంట్‌ రోశారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఐబీగాను, సత్తెనపల్లి, చిలకలూరిపేట సీఎంఎంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రోశారావు ఇన్‌చార్జి అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నాడన్నారు. తాను ఏడాది కిందట బదిలీపై కార్యాలయానికి వచ్చానని, అప్పటి నుంచి ప్రతిరోజూ తనతోపాటు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. మహిళా ఉద్యోగులను మేకప్‌లు వేసుకొని వస్తున్నారంటూ అవమానకరంగా మాట్లాడటం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ‘కుక్కలాగా వాగుతున్నావు‘ వంటి అసభ్య పదజాలంతో దూషించడం, కారణం లేకుండా జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఆయనకు డబ్బులు ఇస్తే బయోమెట్రిక్‌ ఏ సమయంలో వేసినా అంగీకరిస్తాడని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కట్‌ చేస్తున్నాడన్నారు. తనకు వారం రోజుల జీతం తగ్గిస్తే ఎందుకు తగ్గించారని అడిగితే ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు, నీకు చేతనైన చోట చెప్పుకో అని ధూషించాడని పేర్కొన్నారు. పీడీ అనుమతితో రెండురోజులపాటు హెడ్‌ఆఫీసుకు శిక్షణ కోసం తాను వెళ్లానని, జీతం తగ్గించి హెడ్‌ ఆఫీసుకు పంపాడన్నారు. ఎందుకు తగ్గించారని అడిగితే నోటికి వచ్చినట్లు తిట్టాడన్నారు. గతంలో ఒకసారి కూడా ఇదేవిధంగా మాట్లాడాడని చెప్పారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా కార్యాలయంలోని తోటి ఉద్యోగుల కోరికపై మిన్నకుండి పోవాల్సివచ్చిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పనిచేసే మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న అధికారిపై తక్షణం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైతే పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. దీనిపై పీడీ మురళీకృష్ణను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన ఫోన్‌ ఎత్తలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement