వీళ్లు దొంగలు కాదు
పోలీసులకు అప్పగింత
అచ్చంపేట: పొలాలలో అమర్చిన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ కిందకు దించి అందులో ఉండే కాపర్‌ను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు దొంగల్ని చింతపల్లి గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిని అచ్చంపేట పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... చింతపల్లిలోని కృష్ణానది ఒడ్డునే ఉన్న స్కీము, ర్యాంప్ మధ్యలో ఉన్న పొలాలలో రైతులకు చెందిన రెండు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ వద్ద కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌కు అమర్చిన వైర్లను కట్‌చేసి, బోల్టులు ఊరదీసి కిందకు దించేందుకు కావలసిన కట్టర్స్, రెంచీలు వంటి పరికరాలతో సిద్ధంగా ఉన్న సమయంలో గ్రామస్తులు దాడిచేశారు. అప్పటికే రెండు ట్రాన్స్‌ఫార్మర్స్ బోల్టులు ఊడతీసి ఉన్నాయి. గ్రామస్తులు రావడాన్ని గమనించి వారు మినీ లారీలో పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వెంబడించారు. గ్రామం చివర్లో ఉన్న పెట్రోలు బంకు వద్ద ట్రాక్టర్ అడ్డుపెట్టి వాహనాన్ని అడ్డుకున్నారు. మినీ లారీలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని దేవాలయంలో బంధించి అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వీరు వచ్చిన మినీ లారీ తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉంది. వచ్చిన ఆరుగురు కూడా తెలంగాణ యాసలో మాట్లాడడాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులు వచ్చి ఆరుగురు వ్యక్తులను, మినీ లారీని, ట్రాన్స్‌ఫార్మర్స్ ఊడదీసేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చింతపల్లి గ్రామస్తులు అదుపులోకి తీసుకుని తమకు అప్పగించిన వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్స్ దొంగలించే వారు కాదు, గ్రామాలలో తిరిగి పాత స్క్రాప్ కొనుగోలు చేసేవారు. వీరికి ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు సంబంధంలేదు.
– పి.శ్రీనివాసరావు, సీఐ, అచ్చంపేట.


