డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేసిన వ్యవసాయ శాఖ మల్టీపర్పస్‌ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేసిన వ్యవసాయ శాఖ మల్టీపర్పస్‌ ఉద్యోగులు

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

డిమాండ్లు పరిష్కరించేంతవరకు పెన్‌డౌన్‌ రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి పిచ్చికుక్క స్వైర విహారం బాల కవయిత్రులకు అంతర్జాతీయ గుర్తింపు

నరసరావుపేట: వ్యవసాయ శాఖలో గత 12ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కల్పించాలని ఏపీ మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ అసోసియేషన్‌ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం పెన్‌డౌన్‌ పాటిస్తున్నట్లు ప్రకటిస్తూ సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లగూర అనీల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ తమకు గత కొన్నేళ్లుగా రూ.12వేలు జీతం, రూ.3వేలు ఇన్సెంటీవ్‌ మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమ సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు కూడా అందడం లేదన్నారు. దీంతో తమ కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. తమకు సమాన పనికి సమాన వేతనం కింద నెలకు రూ.35వేలు జీతం అందజేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈహెచ్‌ఎస్‌ సదుపాయం కల్పించాలని, విధి నిర్వాహణలో మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు నాగవర్దన్‌, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అనీల్‌, సుభాని, నాయక్‌, అంజిబాబు, శ్యామ్‌ పాల్గొన్నారు.

మరో ఇరువురికి గాయాలు

వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మండలంలోని మండాది బోడు మీద సోమవారం ఉదయం జరిగింది. తెలంగాణలోని పెద్దవూర మండలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఉన్న మన్నెం రవీంద్ర వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు కారులో బయలుదేరి వెళ్తున్న సమయంలో మండాది బోడు మీదకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తాకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న పుల్లమ్మ (70) కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్ధలానికి చేరుకొని గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పుల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

10 మందికి తీవ్ర గాయాలు

విజయపురిసౌత్‌: ిపచ్చి కుక్క దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్‌ లోని దేశవరపు క్యాంపు తండాలో పలువురు వ్యక్తులు బయట ఉండగా పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సాగర్‌ మాత ఆలయం వద్ద ఉన్న ఉన్న ఆరుగురిని అదే పిచ్చికుక్క కరిచి గాయపరచింది. మొత్తం 10 మంది పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రాజెక్ట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు.

తెనాలి: యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌ భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో ఈనెల 18న నిర్వహించిన గీతాంజలి సర్కిల్‌ ఫర్‌ యంగ్‌ క్రియేటివ్‌ రైటర్స్‌ (జీసీవైసీడబ్ల్యు) ఆధ్వర్యంలోని ‘కృష్ణన్‌ తల్వార్‌ అవార్డ్‌ ఫర్‌ యంగ్‌ క్రియేటివ్‌ రైటర్స్‌‘ కార్యక్రమంలో భారతీయ బాల కవయిత్రులు ప్రణవి బిట్రా, ఇషాన్వి బిట్రా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సోదరీమణులు మంగళగిరికి చెందిన బిట్రా వెంకటేశ్వరరావు, మల్లికల కుమార్తెలు. పదహారేళ్ల ప్రణవి బిట్రా సృజనాత్మక రచనలో ప్రతిభ, ఊహాశక్తి, సాహిత్య నిబద్ధతకు గుర్తింపుగా ‘కృష్ణన్‌ తల్వార్‌ అవార్డ్‌ ఫర్‌ యంగ్‌ క్రియేటివ్‌ రైటర్స్‌–2026‘ ప్రదానం చేశారు. అదే కార్యక్రమంలో ఆమె సోదరి, 12 ఏళ్ల ఇషాన్వి బిట్రాకు సృజనాత్మక రచనలో చురుకైన భాగస్వామ్యానికి పార్టిసిపేషన్‌ సర్టిఫి కెట్‌ను అందజేశారు. డాక్టర్‌ కృష్ణ కుమార్‌, చిత్ర కుమార్‌ స్థాపించిన గీతాంజలి సర్కిల్‌ ఫర్‌ యంగ్‌ క్రియేటివ్‌ రైటర్స్‌, ఈ యువ రచయిత్రుల సాహిత్య ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సృజనాత్మక రచనలు చేసి ప్రపంచ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించింది. యూకేలోని డెర్బీ పట్టణంలో ఉంటున్న బిట్రా వెంకటేశ్వరరావు రోల్స్‌రాయిస్‌ ప్రధాన కార్యాలయంలో ఒక డివిజన్‌ టీమ్‌ లీడర్‌గా చేస్తుండగా, మల్లిక అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉన్నారు. వీరి కుమార్తెలు ప్రణవి 11 క్లాస్‌ పాసవగా, ఇషాన్వి ఫోర్త్‌ క్లాస్‌ చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement