జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన డీఎస్పీ హనుమంతురావు
నరసరావుపేటరూరల్: ఆర్థిక, భార్యభర్తల వివాదాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతురావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలతో పాటు బెదిరింపులు, ఆక్రమణల వంటి అంశాలపై 99 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక అంశాలపై 18, భార్యాభర్తల మధ్య వివాదాలపై 16, భూ వివాదాలపై 15, ఆస్తి తగాదాలపై 11 అర్జీలు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్ధాయిలో విచారణ వేగవంతం చేసి న్యాయం చేయాలని పోలీసు అధికారులకు డీఎస్పీ సూచించారు.
పెళ్లి చేసుకుంటాని నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు. బ్యూటీపార్లర్ నిర్వహించుకుంటూ నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను. అయితే నాగమణి అనే మహిళ బ్యూటీపార్లర్‌లో మెలకువలు నేర్చుకునేందుకు నా వద్దకు వచ్చింది. మల్లేష్, నాగమణిలు కలిసి నాపై అనుమానం వచ్చేలా చేసి నా భర్త నుంచి దూరం చేశారు. తరువాత మల్లేష్ నన్ను పెళ్లి చేసుకుంటానని రూ. 4లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లిచేసుకోకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదు.
– ఓ మహిళ, సత్తెనపల్లి
నరసరావుపేట రిక్షాసెంటర్‌లోని బృందా గ్రాండ్ రెస్టారెంట్‌ను ముత్యాల శ్రీను, మాలపాటి బ్రహ్మనందం, జాష్టి నాగేశ్వరరావు, వేమా వెంకటేశ్వరరావుల నుంచి నెలకు రూ.75వేలకు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాను. రెస్టారెంట్ డెవలెప్‌మెంట్‌కు రూ.15లక్షలు ఖర్చు చేశాను. అయితే జీఎస్‌టీ, ఇతర లైసెన్స్‌లు మార్చమని వారిని కోరగా అవి లేవని చెప్పారు. అయితే చట్ట విరుద్దంగా నేను రెస్టారెంట్ నడపనని నా సొమ్ము తిరిగి ఇవ్వమని కోరగా, డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయగలరు.
– కళాసాగర్ రెడ్డి, నరసరావుపేట
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నాకు గుంటూరుకు చెందిన అశ్విన్, విజయ్‌కుమార్‌లు పరిచయమై అటవీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. ఉద్యోగం కోసం రూ.8లక్షలు డిమాండ్ చేయగా విడతల వారీగా రూ.2లక్షలు చెల్లించాను. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇవ్వమని కోరగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
– షేక్ గౌస్‌మోహిద్దీన్, నరసరావుపేట


