కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి నిరసన ర్యాలీ చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన ప్రజా సంఘాలు
నరసరావుపేట: ఢిల్లీలో సీజేపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్‘ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతు న్న విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు సమీపంలోనే ఆందోళనకారులను అడ్డుకుని బలప్రయోగానికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్‌చుక్ అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు సిలార్ మాసూద్, శివకుమారి, సయ్యద్ రబ్బాని, యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.సుందరరావుతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


