శావల్యాపురం: విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగిఉండాలని ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనలకు అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం రూపొందించినట్లు వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. ఎవరైనా అసౌకర్యంగా, అనుమానస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. పేదలు, మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు, ఉచిత న్యాయసేవలు అందుతాయన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో ఎదగాలన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, కట్టా కాళిదాసు, నాగపద్మ, రామాంజినేయులు, ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు, ఇన్‌చార్జి హెచ్‌ఎం సుభాష్, ఉపాధ్యా యుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్


