శ్యాంప్రసాద్, సమగ్ర శిక్ష ఏపీసీఓ
నరసరావుపేట ఈస్ట్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మధ్యలో చదువు మానివేసిన వారికి సార్వత్రిక (దూరవిద్య) ద్వారా ఎంతో మేలు జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పాలేటి శ్యాంప్రసాద్ తెలిపారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఏపీఓఎస్‌ఎస్ అడ్మిషన్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దూరవిద్య ద్వారా 10వ తరగతి చదివేందుకు 14 సంవత్సరాలు, ఇంటర్మీడియెట్‌కు 15 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలని తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్ బి.హైమారావు మాట్లాడుతూ, దూరవిద్య పట్ల ఆసక్తి ఉన్న అభ్యాసకులు (విద్యార్థులు) ఈనెల 31వ తేదీ లోగా ప్రవేశాలు పొందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వయోజనులు, డ్వాక్రా సంఘాల మహిళలు, మధ్యలో చదువు మానివేసిన వారు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులయ్యేందుకు, పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. దూరవిద్య విద్యా సంవత్సరంలో 30 తరగతులకు హాజరు కావాలనీ, మండలాలలో అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ పూర్ణచంద్రరావు, జిల్లా జీసీడీఓ డి.రేవతి, ఐఈఆర్‌పీ కో–ఆర్డినేటర్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


