ఎస్టీయూ నాయకులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ పంచమి (స్కంద పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో సుబ్రహ్మణ్యస్వామి వారి లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం (స్కంద షష్టి) రోజున విశేష పూజలు, సర్పసూక్త హోమం అత్యంత వైభవం నిర్వహించారు. నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం కావడి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం, అనంతరం హస్త, కృత్తిక, విశాఖ, ఆశ్లేష నక్షత్రాల జాతకుల కోసం, శని, రాహు, కేతు గ్రహ జపాలు జరిగాయి. సుబ్రహ్మణ్యస్వామి వారి మూల మంత్రంతో సర్పసూక్త మహా మంత్ర దివ్య హోమంతోపాటు లక్ష్మీ గణపతి, రుద్ర, మృత్యుంజయ మంత్రాలతో విశేష హోమ క్రతువులు జరిగాయి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అఖండ పుష్పార్చన కార్యక్రమంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులైన వేద విద్యార్థులకు, చిన్న పిల్లలకు బ్రహ్మచారుల పూజా కార్యక్రమంలో భక్తులు వేద విద్యార్థులను పూజించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ స్వామి వారి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాపట్ల పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల విఖనస మూర్తి, పరాశరం రఘురామ్, కౌండిన్య, సాయి వెంకట్ పాల్గొన్నారు.


