రేపల్లె: బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న అద్దె బస్సు డ్రైవర్ల సమ్మెకు ఆదివారం తెరపడింది. నూతన వేతన ఒప్పందం కుదరడంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ వంటి కార్మిక సంక్షేమ సదుపాయాలను అమలు చేయడానికి అద్దె బస్సు యజమానులు అంగీకరించడంతో డ్రైవర్లు ఆదివారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. అద్దె బస్సు యూనియన్ (సీఐటీయూ) డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్‌లు మాట్లాడుతూ చీరాలలో అధిక సంఖ్యలో అద్దె బస్సులు ఉండటంతో చీరాల ఆర్డీవో ఆధ్వర్యంలో ఆర్టీసీ, పోలీసు అధికారులు, అద్దె బస్ యజమానులు, డ్రైవర్లు, సీఐటీయూ నాయకుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న ఓటీ బస్ డ్రైవర్ రోజువారీ వేతనం రూ.1,100 నుంచి రూ.1,200, నైట్ అవుట్ బస్ డ్యూటీ వేతనం రూ.1,200 నుంచి రూ.1,300కు పెంచేందుకు యజమానులు అంగీకరించారన్నారు. ప్రతి డ్రైవర్‌కు నెలకు సుమారు రూ.1,500 అదనపు ఆదాయం లభించనుందని చెప్పారు. ఈ నూతన వేతన ఒప్పందాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారన్నారు. అదనంగా ప్రతి బస్సుకు పనిచేసే ఇద్దరు డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన కార్మిక సంక్షేమ సదుపాయాలను కార్మిక శాఖ సమక్షంలో అమలు చేయడానికి కూడా యజమానులు అంగీకరించినట్లు నాయకులు తెలిపారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డ్రైవర్లు, యజమానులు, ఆర్టీసీ అధికారులు కలిసి క్రమం తప్పకుండా సంయుక్త సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మదర్ థెరిసా అద్దె బస్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) కన్వీనర్ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు భాస్కర్, ఇమ్రాన్, బాషా, రవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


