బాబూ.. హామీలు అమలు కావేమి? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. హామీలు అమలు కావేమి?

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

బాబూ.. హామీలు అమలు కావేమి?

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కార్‌ సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు అందని సాగునీరు అమృత్‌ పథకం పూర్తికాక చిలకలూరిపేటలో తాగునీటి సమస్యలు నేడు లింగంగుంట్లలో ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి సీఎం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోలిస్తే తగ్గిన 40 వేల మంది లబ్ధిదారులు

కౌలు రైతులకు మొండిచేయి...

40 వేల మందికి కోత...

ఎన్నికల ముందు అడ్డగోలు హామీలతో ప్రజల ముందుకు వచ్చి గెలిచిన తరువాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చిలకలూరిపేట నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పనులు చేయలేదు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా నేడు చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో పర్యటిస్తున్న నేపథ్యంలో గతంలో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పుల్లారావులు ఇచ్చిన హామీలు, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, నరసరావుపేట: ముఖ్యంగా జిల్లా రైతులకు ఎంతో అవసరమైన సాగునీటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేలా కాలువలను అభివృద్ధి చేయడంతోపాటు పరిధి పెంపు పనులు పట్టాలెక్కలేదు. నియోజకవర్గ పరిధిలోని ఓగేరు, కుప్పగంజి, నక్కవాగులను ఆధునికీకరించాల్సి ఉంది. వాగులు గట్లు బలహీనపడి గండ్లు పడటంతో రైతుల పొలాలు ఏటా నీట మునుగుతున్నాయి. ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురైనా వాటి సంగతి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.

పేటలో తాగునీటి కష్టాలు

చిలకలూరిపేట మున్సిపాలిటీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. రోజుమార్చి రోజు నీటిని అందజేస్తున్నారు. అమృత్‌ పథకం పనులు పూర్తి చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నకిరికల్లు కాలువ నుంచి నీరు వచ్చి ఇంటింటికీ అందజేసే ఆస్కారం ఉండేది. దశాబ్దాల క్రితం పైపులైన్లు నిత్యం పట్టణంలో ఏదో ఒకచోటు పగిలిపోయి నీటి సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రముఖ పర్యాటక క్షేత్రం కొండవీడులో కేవలం ఉత్సవాలతో సరిపెడుతున్నారు. శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయడం లేదు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.

తొలి ఏడాది దగా...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లు వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థిక సహాయం అందజేసేది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చోప్పున ఐదేళ్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఐదేళ్లలో జిల్లాలో ఏకంగా రూ.1,738.58 కోట్ల నిధులను నేరుగా రైతులకు అందించారు. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి రైతులకు హామీ ఇచ్చింది. తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన ఆ హామీని మరిచిపోయింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం ఊసే రాష్ట్ర ప్రభుత్వ ఎత్త లేదు. కేంద్రప్రభుత్వ పీఎం కిసాన్‌ పథకం కింద రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాలలో జమైంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఇలా సుమారు రూ.392 కోట్లను ఎగ్గొట్టింది. కనీసం ఎందుకు తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేకపోయారో సంజాయిషీ కూడా ఇవ్వలేదు.

కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర సాయం, జాబితాలతో సంబంధం లేకుండా ఒకేసారి రూ.14 వేలు అందిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.28 వేలు అందజేయాలి. జిల్లాలోని 17,662 మంది కౌలు రైతులు ఖరీఫ్‌లో సాగు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారికి ప్రభుత్వం సుమారు రూ.50 కోట్లు అందజేయాల్సి ఉంది. కౌలు రైతులు సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందని, అందరికి మొత్తం నిధులను ఒకేసారి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీతోపాటు పలు కౌలు రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చివరి ఏడాదైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు. నేడు జమ చేయనున్న అన్నదాత సుఖీభవ లబ్దిదారుల సంఖ్య మాత్రం 2,40,530 మందిగా ఉంది. ఏకంగా 40 వేల మంది రైతులు తగ్గిపోయారు. రైతుల సంఖ్య అమాంతంగా ఎందుకు తగ్గిపోయిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కోతల ప్రభుత్వమని రైతులు విమర్శిస్తున్నారు. భారీస్థాయిలో రైతుల సంఖ్య తగ్గడానికి సహేతుకమైన కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించింది. తీరా గెలిచిన తరువాత కేంద్ర సాయంతో కలిపి అని మాట మార్చి రైతులను ముంచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement