జీజీహెచ్‌లో రోజురోజుకూపెరిగిపోతున్న అవినీతి సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన డాక్టర్ దుర్గాప్రసాద్ ఇకనైనా పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్న రోగులు
క్యాన్సర్ చికిత్సలో అక్కడ మంచి పేరు
క్యాన్సర్ కణం కంటికి కనిపించకుండా శరీరంలో దాగి ఉండి ట్యూమర్స్‌లాగా మారి కొన్నిసార్లు మనిషి మరణానికి దారితీస్తుంది. ఈ మహమ్మారిపై గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతో మంది రోగులకు చికిత్సలు అందించి నయం చేశారు ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్. ఆయన శుక్రవారం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన జీజీహెచ్‌లో పాతుకుపోయిన అవినీతి క్యాన్సర్‌పైనా ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
గుంటూరు మెడికల్: వ్యాధి నిర్ధారణకు అవసరమైన సర్టిఫికెట్లు మెడికల్ బోర్డు, కిడ్నీ బోర్డు, సదరం బోర్డుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఇస్తున్నారు. ఇలా ఇచ్చేందుకు అధిక మొత్తంలో లంచాలు అడిగినట్లు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. జిల్లా అధికారులకు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో ఆస్పత్రి పరువు బజారున పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు జిల్లాలకు చెందిన లక్షల మంది పేద, మధ్య తరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు జీజీహెచ్‌లో అందించాలి. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తుంటారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఇలా జీజీహెచ్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. కొంతమంది అవినీతి, అక్రమార్జన వల్ల ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. అత్యవసర సేవల విభాగంలో రోగి సహాయకులతో చికిత్సకు వినియోగించే సర్జికల్ ట్రే క్లీనింగ్ చేయించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి జిల్లా అధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. కిందిస్థాయిలో కొంత మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అత్యవసర సేవల నిమిత్తం చేరే వారికి కనీసం వీల్‌చైర్స్ ఉంచకుండా, రోడ్డు ప్రమాద బాధితులను, తీవ్ర అనారోగ్యంతో చికిత్సకు ఎమర్జన్సీ వార్డుకు వచ్చే రోగులను చికిత్సకు తీసుకెళ్లకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణికి వీల్‌చైర్ ఇవ్వకపోవడం, స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లపోవడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విధులకు సీనియర్లు డుమ్మా
సీనియర్ వైద్యులు కొంత మంది సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్‌లో అందుబాటులో ఉండాలి. పలువురు మధ్యాహ్నం కల్లా సొంత క్లీనిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి సరిపుచ్చుతున్నారు. జూనియర్ వైద్యులే రోగులకు ఓపీ చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి బెడ్‌సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఓపీ రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లి పోతున్నారు.
మామూలు ఇస్తేనే...
జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే వైద్య సిబ్బందికి మామూలు ఇవ్వాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి వసూలు చేస్తారు. మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. పరిపాలనా కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా అదే దుస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి ఎంతోకొంత ఇస్తేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండబాలివారిపాలెంకు చెందిన డాక్టర్ దుర్గాప్రసాద్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అనంతరం హైదరాబాద్ వెళ్లి ఉస్మానియాలో పీజీ చేశారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ప్యాలెట్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చి క్యాన్సర్ వైద్యుడిగా పేరు పొందారు. పదోన్నతిపై అనంతపురం వెళ్లి రేడియేషన్ ఆంకాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేసి మన్ననలు అందుకున్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు 2020లో వచ్చారు. క్యాన్సర్ చికిత్సల్లో విజయం సాధించిన ఆయన పరిపాలనాపరమైన పోస్ట్‌లోకి డెప్యూటీ సూపరింటెండెంట్‌గా ప్రవేశించి, నేడు నేరుగా సూపరింటెండెంట్ అయ్యారు.


