చిలకలూరిపేట: రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు విమర్శించారు. కౌలు రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కరపత్రాలను పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కౌలు రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు కూడా వ్యవసాయ రుణాలు అందజేయడటం లేదని అన్నారు. డాక్టర్ ఎన్‌ఎస్ స్వాఽమినాధన్ సిఫార్సుల మేరకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా అన్ని పంటలకు చట్టబద్దమైన మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రుణాలు, ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. ఈ నెల 30న నిర్వహిస్తున్న ఛలో విజయవాడ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సుభాని, సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, బొంతా ధనరాజు, ఏలిక శ్రీనివాసరావు, బొంతా నాసర్ తదితరులు పాల్గొన్నారు.


