మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో సత్తా | - | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో సత్తా

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

చినగంజాం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్‌ గ్రాండ్‌ మాస్టర్లతో పోటీ పడి మూడో స్థానం సాధించాడు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పర్వతరెడ్డి అజయ్‌ సంతోష్‌. ముంబైలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జూన్‌ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన 360 వన్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో గ్రాండ్‌ మాస్టర్లతో పోటీలో పాల్గొన్న అజయ్‌ సంతోష్‌ 9కి 6 పాయింట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాడు. అజయ్‌ సంతోష్‌ ఈ పాటికే 2500 ఫిడే రేటింగ్‌ను దాటి తన మొదటి జీఎం నార్మ్‌ను సాధించాడు. గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను సాధించడానికి అతడు ఇంకా కేవలం 2 నార్మ్‌లు మాత్రమే సాధించాల్సి ఉంది. అజయ్‌ వచ్చే వారం మరో జీఎం టోర్నమెంట్‌ కోసం చైన్నె వెళ్ళనున్నాడు. అటు తరువాత మరిన్ని నార్‌మ్స్‌ సాధించేందుకు యూరప్‌లోని చెక్‌ రిపబ్లిక్‌, పారిస్‌.. ఫ్రాన్స్‌ దేశాలకు ప్రయాణం కానున్నట్లు అజయ్‌ తాతయ్య పర్వతరెడ్డి కాంతారావు తెలిపారు. అజయ్‌ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.

పెదకాకానిలో చోరీ

పెదకాకాని:గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేసిన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని శివాలయం రోడ్డులోని న్యూఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ వెనుక బజారులో బత్తుల సుబ్బయ్య కుటుంబం నివశిస్తుంది. వారు రోజూ మాదిరిగానే ఇంటికి తలుపులు వేసి వరండాలో నిద్రించారు. ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గుండా గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులులోనికి ప్రవేశించి, బీరువా తెరచి అందులో ఉన్న 7 గ్రాముల బంగారు వస్తువులు, పిల్లలు దాచుకున్న మట్టి ముంత(కిడ్డీ బ్యాంక్‌)లో ఉన్న నగదు, సుమారు 200 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ చోరీలో వరండాలో పడుకున్న వారు ఇంటిలోపలికి రాకుండా ఇంట్లో ఉన్న తలుపునకు లోప ల గడియపెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచి తలుపు తీస్తుండగా ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే వెనుక ఉన్న కిటికీ తొలగించి ఉంది. బీరువా తెరచి వస్తువులు చిందర వందరగా పడి ఉంటడం, కిడ్డీ బ్యాంక్‌ పగులగొడ్డడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్‌టీంను రప్పించారు. నిందితులు బంగారు వస్తువులతో కలసి ఉన్న రోల్డ్‌గోల్డ్‌ వస్తువులను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement