గుంటూరు మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల సహకారంతో జిల్లాలోని ప్రైవేట్ వైద్యులకు గురువారం అంటువ్యాధుల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐఎంఏ హాల్‌లో సాయంత్రం 7 నుంచి 10 గంటల సదస్సు ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ వైద్యులందరూ హాజరు కావాలని కోరారు.
నరసరావుపేట: ఎస్సీ నిరుద్యోగులకు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన కింద మేళాతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెనాలి: శ్రీలక్ష్మీనారాయణసహిత శ్రీసుదర్శనయాగ మహోత్సవం బుధవారం వైభవంగా ఆరంభమైంది. సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ చేపట్టిన భారీ యాగశాలలో వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 20 మంది రుత్వికులు ఉదయం ఏడు గంటలకు సూర్యనమస్కారాలు, దీక్షతో ఆరంభించారు. వేమూరి విజయభాస్కర్, సీత దంపతులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. తొలిరోజున సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, తాడిబోయిన హరిప్రసాద్ యాగాన్ని సందర్శించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్‌యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్‌కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చని చెప్పారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్, సబ్ జూనియర్ బాల బాలికల ఫుట్‌బాల్ జట్ల ఎంపిక ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరేచర్ల ఫుట్‌బాల్ మైదానంలో జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ బాయ్స్ విభాగాలకు సంబంధించి ఆదివారం ఉదయం సెలక్షన్ జరుగుతాయని తెలిపారు. జూనియర్ గర్‌ల్స్, సబ్ జూనియర్ గర్ట్స్ సంబంధించి 22వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7337585790 సంప్రదించాలని కోరారు.
పెడన: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి తమ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్ట్రస్థాయిలో కలె క్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెడన పట్టణంలోని సర్వోదయ సొసైటీలో బుధవారం జరిగిన కృష్ణా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అమలుపై చర్చించారు.


