2,06,521 ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

2,06,521 ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

2,06,521 ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ జైళ్లశాఖ ఉద్యోగులకు సర్వీస్‌ నిబంధనలు అన్వయించాలి

నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 2,06,521 ఎన్యూమరేషన్‌ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. ఇందులో అత్యధికంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 45,063, నరసరావుపేటలో 40,346 ఫారాలు పంపిణీ చేశామన్నారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన ఫారాల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 5,455 ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వీరి వివరాల సేకరణ, సవరణ కోసం క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓల ద్వారా ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

మంత్రి లోకేష్‌కు వినతిపత్రం అందజేత

సత్తెనపల్లి: ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంఎస్‌ నంబర్‌ 45, జీఓ ఎంఎస్‌ నంబర్‌ 54 ప్రకారం ఏపీ కారాగార, సంస్కరణల శాఖ(జైళ్ల శాఖ)లో విధులు నిర్వహిస్తున్న దిగువ స్థాయి ఉద్యోగులైన వార్డర్లు, హెడ్‌ వార్డర్లు, చీఫ్‌ హెడ్‌ వార్డర్ల సర్వీసు నిబంధనల్లో అన్వయించాలని ఏపీ జైళ్ల ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నంబుల విశ్వేశ్వరరావు కోరారు. బుధవారం మంత్రి నారా లోకేష్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పరిధిలో దిగువ స్థాయి ఉద్యోగులైన వార్డర్లు, హెడ్‌ వార్డర్లు, చీఫ్‌ హెడ్‌ వార్డర్లలో అనేక మంది ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు దూరంగా అనేక ఏళ్లుగా పనిచేస్తూ వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర అనారోగ్యాలకు గురై, ఆకస్మిక మరణాలకు కారణమైన దుర్భర పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆయనతోపాటు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మువ్వల శ్రీకృష్ణమూర్తి, కార్యదర్శి వి.ప్రభు, సలహాదారుడు కె.జ్ఞాన సుందరం ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement