తండ్రి సెల్‌ఫోన్‌కు మెసెజ్ పెట్టి అదృశ్యమైన విద్యార్థిని
లక్ష్మీపురం: గుంటూరు ఓ కళాశాలలో ఇంటర్ సీఎంఏ చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయి.. మనస్థాపంతో తండ్రికి మెసెజ్ పెట్టి ఓ కుమార్తె అదృశ్యమైన ఘటనపై అరండల్‌పేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చిల్లర అనురాధ అనే విద్యార్థిని గత మూడు సంవత్సరాలుగా బ్రాడీపేటలోని హాస్టల్లో ఉంటూ గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఇంటర్ సీఎంఏ చదువుతోంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఈక్రమంలో పది రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్ళిన రోజు తన తండ్రికి ‘నన్ను క్షమించండి నేను జాబ్ కోసం వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి సాధించి వస్తానని.. నేను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను’ అని సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేసింది. దీంతో అప్పటి నుంచి చుట్టు పక్కన బంధుమిత్రుల వద్ద విచారించినా ఎంతకు ఆచూకీ తెలియక పోవడంతో దిక్కుతోచక అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అనురాధ తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


