రేపు దుగ్గిరాల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు దుగ్గిరాల బంద్‌

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్‌ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల పసుపు కాలి బూడిదైనా గాని ప్రభుత్వం పట్టించుకోవకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, అధికారులు చేసిన ఒప్పందానికి విలువ లేకపోతే రైతులకి ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కనీసం 179 సార్లు మంత్రులు, అధికారులు చుట్టూ అగ్ని బాధిత పసుపు రైతులు ప్రదక్షిణలు చేసినా కరుణించలేదన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయని కూడా గుర్తుచేశారు. ఈ నెల 8న తెనాలిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, జూన్‌ 10న దుగ్గిరాల పసుపు వ్యవసాయ మార్కెట్‌ యార్డు ముట్టడి చేసినట్టు తెలిపారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్‌కు అగ్ని బాధిత పసుపు రైతులు కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. దుగ్గిరాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు శ్రేయోభిలాషులు కార్మికులు, విద్యా వాణిజ్య సంస్థలు అందరూ బంద్‌కు సహకరించాలని కోరారు. వీరితో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు కూడా ఉన్నారు.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి వాహనాలు దగ్ధం

పట్నంబజారు: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం.. కొత్తపేట పోలీసు స్టేషన్‌ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ సోమవారం రాత్రి ఈదురుగాలులకు పేలింది. నిప్పులు చెలరేగడంతో అక్కడ ఉన్న మూడు ద్విచక్రవాహనాలు తగలబడినట్లు సమాచారం. అయితే పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు సైతం పోలీసులు రోడ్డుపైనే పార్కింగ్‌ చేసిన పరిస్థితుల్లో, వాటితోపాటు ఇతరుల వాహనాలు కూడా తలగబడినట్లు తెలుస్తుంది.

గంజాయి కేసులో నిందితులు అరెస్టు

పట్నంబజారు: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, కొత్తపేట సీఐ వీరయ్య వివరాలు మీడియాకు మంగళవారం వెల్లడించారు. నెహ్రూనగర్‌కు చెందిన గుర్రం శివకుమార్‌, బత్తుల శశాంక్‌, శ్రీనగర్‌కు చెందిన చెన్నంశెట్టి రుద్రబాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డితోటకు చెందిన దాసరి గురవయ్యలు నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్‌ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిందితుల నుంచి ఐదు కిలోల 360 గ్రాముల గంజాయి స్వాధీనం చసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు.

బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై నిరసన

మేడికొండూరు : గ్రామ పునర్నిర్మాణ సంఘం (వీఆర్‌ఓ)లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తమకు రావలసిన పీఎఫ్‌, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇతర చట్టబద్ధ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 2018 సంవత్సరం నుంచి తమకు రావలసిన బకాయిల కోసం నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు. పీఎఫ్‌ కమిషనర్‌ సహకారంతో పలుమార్లు సంఘ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించడం, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, చర్చలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ సంఘ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు ప్రాంత ప్రతినిధి టి.మురళి, కమిటీ సభ్యులు రమేష్‌బాబు, మోహన్‌, ఏసోబు, విజయలక్ష్మి, సునీల్‌ తదితరులు పాల్గొని మాజీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

‘పది’లో రోజువారీ పరీక్షలు ఉపసంహరించుకోవాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాఠశాలలు పునః ప్రారంభమైన తరుణంలోనే పదో తరగతి విద్యార్థులకు రోజువారి పరీక్షలను నిర్వహించాలనే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిపాటిదాస్‌, మొహమ్మద్‌ ఖాలిద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి షేక్‌ సలీమ్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యాంశాలను చాప్టర్‌ వైజ్‌గా బోధించాల్సిన సమయంలో రోజువారి పరీక్షలు నిర్వహించడం వలన ప్రశ్న, సమాధానాలుగా తరగతులు మారిపోతాయని అన్నారు. రోజువారి పరీక్షలను ఉపసంహరించుకుని వారంతపు పరీక్షలు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీ టీఎఫ్‌ ఫిరంగిపురం, పొన్నూరు మండల శాఖల అధ్యక్షులు జహంగీర్‌, వి.కిషోర్‌షా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement