● ధ్రువీకరించిన మేలు రకం విత్తనాలను ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థల నుంచి లేదా పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ శాఖ గుర్తించిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.
● విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లాటు నంబర్, తేదీ, రకం వివరాలతో సంతకం చేసిన బిల్లును రైతులు విధిగా పొందాలి. ఆ బిల్లును పంట కోత పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచాలి.
● విత్తన సంచిపై వేసిన గడువు తేదీని గమనించాలి. ఆ తేదీ లోగా విత్తనాలను ఉపయోగించాలి. గడువు తేదీ ముగిసిన విత్తనాలను కొనొద్దు.
● విత్తన సంచిపై సూచించినట్టు మొలక శాతం, నికర తూకం పరీక్షించి ఉపయోగించాలి. పంట కాలం పూర్తయ్యే వరకు విత్తన సంచిని జాగ్రత్త చేసుకోవడం అవసరం.
● సంకర విత్తనాన్ని(హైబ్రిడ్) ప్రతి పంటకు విధిగా మార్చుకోవాలి. హైబ్రిడ్ విత్తనాలు ఒక పంటకు మాత్రమే ఉపయోగపడతాయి.
● పత్తిలో నిషేధిత విత్తనాలను వాడవద్దు. అనుమతిలేని, పర్యావరణంకు హాని కలిగించే హెచ్‌టీ పత్తి విత్తనాలను వాడరాదు.
● మేలురకపు అధిక దిగుబడినిచ్చే వంగడాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొని ఆ పంట ద్వారా అభివృద్ధి చేసిన విత్తనాలను రెండు, మూడేళ్ల వరకు వాడుకోవచ్చు.
● విత్తనం సేకరించేటప్పుడు తెగులు సోకని పంట నుంచి నాణ్యమైన దృఢమైన విత్తనాన్ని సేకరించి భద్రపరుచుకోవాలి.
● రైతు సేకరించే విత్తనాలు బాగా మొలకెత్తే శక్తి కలిగి, రంగు, పరిమాణం, ఆకారంలో విత్తనాలన్నీ ఒకే మాదిరిగా ఉండాలి.
● కేళీలు, ఇతర కలుపు మొక్కల విత్తనాలు లేకుండా చూసుకోవాలి.
● తాలు గింజలు, పూర్తిగా తయారు కాని గింజలను తొలగించడానికి ముందు రెండు శాతం ఉప్పు ద్రావణంలో పోసి పైకి తేలిన విత్తనాలను వేరుచేసి మంచి నీటితో కడిగి ఆరబెట్టి ఉపయోగించాలి.
● బాగా ముదిరిన గింజలనే ఎంపిక చేసుకుని, విత్తనాలుగా వాడాలి. అనధికారికంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయరాదు. లూజు విత్తనాలు వాడటం మంచిది కాదు. అనుమతి లేకుండా విత్తనాలు అమ్మేవారిపై సమీపంలోని వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.ఫిర్యాదులుంటే 8331056901 ఫోన్ నంబరుకు ఫిర్యాదులు చేయాలి.
లైసెన్స్ కలిగిన డీలరు వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం నాణ్యమైన విత్తనాలు, జాగ్రత్తలతో అధిక దిగుబడులు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి
కొరిటెపాడు(గుంటూరు): విత్తనం మంచిదైతే పంట బాగా పెరుగుతుంది. దిగుబడులు మెరుగ్గా ఉంటాయి. కొంతమంది రైతులు విత్తనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరు. దొరికింది కదాఅని ఏదో ఒకటి కొని విత్తుకుని నష్టపోతుంటారు. వ్యవసాయంలో రాణించడానికి, అధిక దిగుబడులు పొందడానికి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. రైతులు సరైన విత్తనం ఎంపిక చేసుకోకుండా ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. విత్తన ఎంపిక, కొనుగోలులో కొన్ని మెళకువలను తప్పనిసరిగా పాటంచాలి. మరో వారం, పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు తమ పొలాలను సీజన్‌కు సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాల కొనుగోలు, ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ఎం.పద్మావతి సూచిస్తున్నారు. మంచి దిగుబడి విత్తనం ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేంటో చుద్దాం.