రక్షణ కరువైనది | - | Sakshi
Sakshi News home page

రక్షణ కరువైనది

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

ఏడాది కాలంలో 10 మందికి పైగా మృతి

2025 మార్చి 4న అచ్చంపేట మండలం, ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట రాంకుమార్‌(28), కోగంటివారిపాలెం వద్ద నదిలో ఈతకు దిగి మృతిచెందాడు

2025 ఏప్రిల్‌ 2న అమరావతికి చెందిన నల్లకుంట్ల రాజేష్‌(24) అమరావతి దేవాలయ సమీపంలోని నదిలో ఈతకు దిగి మృతిచెందాడు

2025 మే 25న నకరికల్లు మండలం, చాగల్లు గ్రామానికి చెందిన ఆలపర్తి సైదారావు సత్తెమ్మతల్లి దేవాలయానికి వచ్చి మొక్కుబడులు తీర్చుకుని, గింజుపల్లి వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందాడు

ఇటీవల కాలంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది స్నేహితులతో వచ్చి ఇద్దరు మృతి చెందారు.

ఈనెల 14న కోనూరు వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నదిలో మృతి చెందిన ఘటన తెలిసిందే..

2017 జనవరిలో కూడా ఇదే తరహాలో కోనూరు ఇసుక రీచ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

2018 లోనూ అచ్చంపేట మండలంలోని నిండుజర్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కోనూరు రీచ్‌లోనే మృతిచెందారు.

నదీ గర్భానికి తూట్లు

మృతుల్లో యాత్రికులే అధికం

అచ్చంపేట: కృష్ణానది తీర గ్రామాల్లో రక్షణ కరువైంది. అధికారుల నిఘా కొరవడింది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉండవు. నదిలో ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ లోతు తక్కువగా ఉంటుందో తెలియని పరిస్థితులున్నాయి. దీనికి తోడు పలు గ్రామాల్లో నదిలో భారీ పొక్లెయినర్లతో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇసుక తోడేస్తున్నారు. ఆ గుంతలలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు, నదిలో ప్రమాదం జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావిడి చేయడం, ఆ తరువాత తమకేమి పట్టనట్లు ఉండటం అధికారులకు పరిపాటుగా మారింది. నదీ తీరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో కూడా కనీసం హెచ్చరిక బోర్డులు ఉంచకపోవడం గమనార్హం.

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు

మండలంలోని కోనూరు, కస్తల, కోగంటివారిపాలెం, గింజుపల్లి, మాదిపాడు, తాడువాయి, చింతపల్లి, చామర్రు గ్రామాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉంటాయి. ఈ గ్రామాలకు పండుగలకు, పబ్బాలకు వచ్చే బంధువులు ఫంక్షన్లు అయిపోగానే నది సందర్శనకు వెళ్లి అందులో స్నానాలకు, ఈతకు, లోతు తక్కువగా ఉందనుకుని ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు, ఒడ్డునే ఉండే చేపల పడవల్లో నదిలో సరదాగా తిరిగేందుకో యత్నిస్తూ.. ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.

సెలవు రోజుల్లోనే..

కృష్ణానదిలో సెలవు రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కు వగా జరుగుతున్నాయి. సెలవురోజు స్నేహితులతో రావడం, నదిలో దిగి ప్రాణాలు కోల్పోవడం ఇక్కడ నిత్యకృత్యం. అధికారులు నదివద్ద సిబ్బందిని కాప లా ఉంచి అందులోకి దిగకుండా చర్యలు తీసు కోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌ సిబంంది ఎవరికి వారు మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోనూరు వద్ద యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపు (ఫైల్‌)

ఈతకోసం నదిలో దిగే వారికి ఇసుక గుంతలు ఎక్కడున్నాయో, నదిలో రాళ్లు ఎక్కడున్నాయో, ఎక్కడ దిగితే ప్రమాదమో తెలియక మృత్యుఒడిలోకి జారుకుంటున్నారు. అచ్చంపేట మండలంలో ఎక్కువగా గింజుపల్లి, చామర్రు, చింతపల్లి, అంబడిపూడి, కోనూరు, కోగంటివారిపాలెం గ్రామాలవద్దగల నది గర్భంలో అధికార టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద యంత్రాలతో తవ్వుతూ, లోతైన గుంతలు తీసి, ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో నింపి జేబులు నింపుకొంటున్నారు. దీంతో ఆయా చోట్ల నదిలో గుంతలు ఏర్పడి అందులో దిగినవారు బయటకు రాలేక మరణిస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకుని, ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో నదిలో అక్రమ తవ్వకాలు, అకాల మరణాలు ఆగేలా లేవు.

కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడే వారిలో దూర ప్రాంతాలనుంచి వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. మాదిపాడుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉండే సత్తెమ్మతల్లిని దర్శించుకునేందుకు ప్రతి ఆది, గురు, శుక్రవారాలలో వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనం తరువాత అక్కడకు దగ్గరలోనే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పులిచింతల ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి, అక్కడనుంచి ప్రాజెక్టుకు దిగువన ఉండే మాదిపాడు, గింజుపల్లి ఇసుక రేవులకు ఈత కొట్టేందుకు వెళుతుంటారు. ఇసుక కోసం తీసిన గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక లోతుల్లోకి వెళ్లి పోవడం, పాచిపట్టిన రాళ్లపై కాలువేసి జారి నదిలో పడిపోయి నదీ ప్రవాహానికి కొట్టుకుపోవడం జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement