అచ్చంగా పచ్చ పోలీసింగ్‌! | - | Sakshi
Sakshi News home page

అచ్చంగా పచ్చ పోలీసింగ్‌!

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

తీవ్ర వివాదాస్పదంగా పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావ్‌ తీరు అధికారపార్టీ నేతలు చెప్పిందే చట్టంగా వ్యవహారం వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు సివిల్‌ పంచాయితీలకు అడ్డాగా పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌ సీఐ వెంకట్రావు చర్యలతో ఇప్పటికే ఆర్యవైశ్య మహిళ ఆత్మహత్యాయత్నం తీవ్ర ఆరోపణలున్న సీఐపై చర్యలు తీసుకోని పోలీసు ఉన్నతాధికారులు

సాక్షి, నరసరావుపేట: ఖాకీ చొక్కొ వేసుకున్నా ఆ సీఐ చేసేది పచ్చ పోలీసింగ్‌. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త కన్నా ఆ పార్టీ కోసం సదరు సీఐ బరితెగించి మరీ పనిచేస్తుంటారు. స్థానికి ప్రజాప్రతినిధి నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వస్తే చాలు పోలీసు బాస్‌ల ఆదేశాలను సైతం పక్కనపెట్టి అప్రజాస్వామికంగా పనిచేస్తుంటారు. వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా పదుల సంఖ్యలో అక్రమ కేసులు బనాయించి వారిని వేధించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడి దోచుకుంటున్నాడు. ఆ స్టేషన్‌ ముందు ఇక్కడ సివిల్‌ పంచాయితీలు పరిష్కరింపబడవు అని బోర్డు ఉంటుంది... కానీ లోపల మాత్రం నిత్యం అదే పంచాయితీల గోల. అదే పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌.. ఆయనే సీఐ శ్రీరాం వెంకట్రావ్‌. ఆయన వేధింపులు తాళలేక ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ఊళ్లు వదలి వెళ్లిపోగా ఓ ఆర్యవైశ్య మహిళ స్టేషన్‌లోనే కత్తితో చేయి కోసుకోని ఆత్మ హత్యాయత్నం చేసింది. తాజాగా సోమవారం ఓ దళిత యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యాయత్నం చేయడంతో మరోసారి సీఐ ప్రవర్తనపై చర్చ నడుస్తోంది.

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే లక్ష్యం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల సీఐ వెంకట్రావ్‌ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా అక్ర మ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు. పిడుగురాళ్ల పరిధిలోని ఓ గ్రామంలో రాజకీయ నాయ కుడి విగ్రహం చేయి విరిగింది. దానితో ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను స్టేషన్‌కు తీసుకువచ్చి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తేనే ఆ కేసులో ఇరికించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. గాలికి అధికారపార్టీ ఫ్లెక్సీ చిరిగినా దానికి కారణం మీరేనంటూ వైఎస్సార్‌సీపీ నేతలను వేధించి తీవ్రంగా హింసించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్‌ సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టులే టార్గెట్‌గా రౌడీషీట్లు, పీడీ యాక్టులు తెరిచాడు. సివిల్‌ పంచాయితీలకు అడ్డా

పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌ సివిల్‌ పంచాయితీలకు అడ్డాగా సీఐ వెంకట్రావ్‌ మార్చాడు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం వంటివి ఇక్కడినుంచే చేస్తుంటారు. ఆర్య వైశ్య వ్యాపారులను అనేకమందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుకు ఉన్న క్వార్టర్ట్స్‌లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్యవైశ్యులు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోకపోతే ఇంకెదరి ప్రాణాలు, ఆస్తులు పోతాయన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement