సమానత్వాన్ని చాటే బక్రీద్‌ పండుగ | - | Sakshi
Sakshi News home page

సమానత్వాన్ని చాటే బక్రీద్‌ పండుగ

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

త్యాగం, సమభావం ఇదే ఖుర్బానీ సందేశం నేడు పండుగకు ఈద్గాలు, మసీదులు సిద్ధం

యడ్లపాడు: ఇస్లాంలో ఖురాన్‌ ప్రకారం ముస్లింలకు అతిముఖ్యమైన పండగ బక్రీద్‌ (ఈద్‌–ఉల్‌–అజ్హా). హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జులహజ్జ 12వ నెల 10వ రోజున ముస్లింలు బక్రీద్‌ జరుపుకొంటారు. ఈ పండుగ వెనుక త్యాగ చరిత్ర ఉంది. ఇబ్రహీం ప్రవక్తకు తన ఎనభయ్యో ఏట అల్లాహ్‌ ప్రసాదించిన ఏకై క కుమారుడు ఇస్మాయిల్‌. కొడుకును దైవానికి బలి ఇస్తున్నట్లు ఇబ్రహీంకు కల వస్తుంది. దాన్ని దైవాజ్ఞగా భావించి తనయుడితో సంప్రదిస్తాడు. దైవకార్యానికి తాను సిద్ధమని ఆ కుమారుడు చెబుతాడు. ప్రేమపాశం ఎక్కడ అడ్డుపడుతుందోనని తండ్రి కళ్లకు గంతలు కట్టుకుని కుమారుడి గొంతుపై కత్తి పెట్టవలసి వస్తుంది. మూడుసార్లు ప్రయత్నించినా ఆ ఖడ్గం బాలుడిని ఏమీ చేయలేకపోయింది. అసహనంతో ఇబ్రహీం ఆ కత్తిని పక్కకు విసరగా, అది ఒక రాతి గుండును తాకి రెండు ముక్కలు చేసింది. ఆ క్షణంలోనే దైవదూత జిబ్రాయిల్‌ ప్రత్యక్షమై, ఇబ్రహీం విశ్వాస పరీక్షలో నెగ్గాడని ప్రకటించినట్లు ముస్లింల నమ్మకం. ఇస్మాయిల్‌ స్థానంలో స్వర్గం నుంచి తెచ్చిన ఒక బలమైన పొట్టేలు (దుంబా) ప్రత్యక్షమైంది. కుమారుడికి బదులుగా ఆ పొట్టేలును బలి ఇవ్వడమే ఖుర్బానీగా నిలిచింది. నాటి తండ్రీకొడుకుల అచంచల విశ్వాసానికి, త్యాగనిరతికి ప్రతీకగా ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

తారతమ్యాలు లేకుండా...

ఇస్లాంలోని పంచసూత్రాలైన అల్లాహ్‌పై విశ్వాసం(ఇమాన్‌), ప్రార్థన(నమాజ్‌), ఉపవాసం(రోజా), దానం(జకాత్‌, మక్కాయాత్ర(హజ్‌) ఆచరించేందుకు పరితపిస్తారు. స్తోమత ఉన్నవారు మక్కా వెళ్లి హజ్‌ ఆరాధనలో పాల్గొంటారు. లేనివారు స్థానికంగానే ఖుర్బానీ ఇస్తారు. ఇది మానవుల ఐక్యతను సూచిస్తుంది. ఎవరైనా ముస్లిం.. బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు, మరో దానిని బంధువులకు ఇవ్వాల్సి ఉంటుంది. పేద, ధనిక అనే తారతమ్యాలు లేని సమాజాన్ని స్థాపించడమే ఈ పండుగ మానవాళికి నేర్పే జీవన పాఠంగా ముస్లింలు భావిస్తారు. సాధారణంగా పండుగ అంటే పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. బక్రీద్‌ అంతరార్థం కొత్త బాధ్యతలను భుజానకెత్తుకోవడం. మానవత్వాన్ని ఎలా చాటి చెప్పాలో నేర్పిస్తోంది. ఆకలి లేని సమాజం కోసం ఒక మనిషి చేసే గొప్ప సంకల్పమే ఈ పండుగ అంతరార్థం.

Advertisement
 
Advertisement
Advertisement