మూడోసారీ మారువేషంలో.. | - | Sakshi
Sakshi News home page

మూడోసారీ మారువేషంలో..

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

జీజీహెచ్‌లో సూపరింటెండెంట్‌ మారు వేషంలో తనిఖీలు పబ్లిసిటీనే.. ఫలితం లేదు మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఏ విధమైన లోపాలు కనిపించవు.. ఎవరిపై క్రమశిక్షణ చర్యలూ లేవు సూపరింటెండెంట్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్‌ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్‌ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా 2024 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్‌లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్‌లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్‌ మీడియాలో దానిని పోస్ట్‌ చేసి ఆయన వైరల్‌ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.

మూడుసార్లు తూతూ మంత్రమే..

సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్‌ సర్జన్‌, డ్యూటీ అసిస్టెంట్‌ ఫిజీషియన్‌లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్‌ డాక్టర్స్‌, సర్జన్స్‌ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్‌ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్‌ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్‌ రాకుండా జూనియర్స్‌పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్‌ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement