బొల్లవరం(ముప్పాళ్ల): ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్‌ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్‌ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నకరికల్లుః ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని త్రిపురాపురం సమీపంలో అద్దంకి– నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు.. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలేనికి చెందిన షేక్ మస్తాన్‌షరీఫ్(34) ద్విచక్ర వాహనంపై సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి కొండమోడుకు బయలుదేరాడు. మార్గంమధ్యలో మండలంలోని త్రిపురాపురం సమీపంలో హైవే డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డీఎస్‌ఓ నరసింహారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు వివిధ క్రీడా వేదికలపై నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన తేదీలను శాప్ అధికారులు మార్పు చేసినట్టు వివరించారు. సవరించిన తేదీల మేరకు తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నీస్, కాకినాడలోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 29 నుంచి 30వ తేదీ వరకు వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో, విశాఖపట్నం కొమ్మాది స్టేడియంలో ఈనెల 31, జూన్1వ తేదీ వరకు అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తారని వివరించారు. ఆయా పోటీలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న బాల బాలికలు తప్పని సరిగా తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయని క్రీడాకారులు శాప్ క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


