మోదీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

మోదీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

నరసరావుపేట ఈస్ట్‌: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆందోళన వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విధానాల కారణంగా కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూరుతూ, సామాన్యునిపై ఆర్థిక భారాలు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ దేశ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తాకట్టు పెట్టి రష్యా నుంచి ఆయిల్‌, ఇరాన్‌ నుంచి గ్యాస్‌ కొనుగోలు నిలిపి వేశారని విమర్శించారు. 5 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం దేశ ప్రజలను మోసం చేయటమే అని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రూపాయి పతనావస్థకు చేరి డాలరు మారకం రూ.96.07కు చేరిందని ఎద్దేవా చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జూన్‌ 1 నుంచి 4వ తేదీ వరకు కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సమ్మేళనం జయప్రదం చేయాలని అక్కినేని వనజ కోరారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు వై.చెంచయ్య, జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, గిరిజన సమాఖ్య నాయకులు శ్రీనునాయక్‌, రాంబాబునాయక్‌ పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ

Advertisement
 
Advertisement
Advertisement