మూడో అంతస్తులో రక్త, మూత్ర సంబంధిత పరీక్షలు సాంకేతిక లోపంతో తరుచూ మొరాయిస్తున్న లిఫ్ట్ మెట్లు ఎక్కలేక నిత్యం నరకయాతన ఆస్పత్రి మారినా అతివలకు తప్పని కష్టాలు రద్దీకి అనుగణంగా సిబ్బంది లేక సేవల్లో తీవ్ర జాప్యం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తప్పని ఇక్కట్లు
కడుపులో బిడ్డ కదలాడుతుంటే తల్లి గుండెల్లో ఆనందం ఉరకలేస్తుంది. నెలలు నిండేకొద్దీ పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నామనే భావన మాతృత్వపు మాధుర్యాన్ని గుర్తు చేస్తుంటుంది. కోటి ఆనందాలతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన నిండు చూలాలి సహనానికి ప్రతిక్షణం పరీక్షగా పరిస్థితి ఉంది. కొద్దిసేపు నడిస్తేనే అలసటతో కూలబడే గర్భిణులకు మూడు అంతస్తులో పరీక్షలకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా మారింది. నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలోని ఈ దుస్థితి చంద్రబాబు సర్కారు నిర్వాకానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
నరసరావుపేట టౌన్‌్: తల్లి కాబోతున్నామనే ఆనందం కన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం పడుతున్న అవస్థలే గర్భిణులను ఎక్కువగా వేధిస్తున్నాయి. వైద్యశాల మారినా తిప్పలు తప్పటం లేదు. పల్నాడు బస్టాండ్‌లోని పాత ఏరియా వైద్యశాలలో కొనసాగుతున్న గైనిక్ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల వైద్యశాల నూతన భవనంలోకి ఇటీవల మార్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సేవల్లో జాప్యం చోటుచేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న జనరల్ వార్డును ఆధునికీకరించి అందులో గైనిక్ విభాగాన్ని 15 రోజుల క్రితం నూతనంగా ఏర్పాటు చేశారు. వైద్యశాల మారింది గానీ సమస్యలు మాత్రం అదే రీతిలో ఉన్నాయి. పాత ఏరియా వైద్యశాలలో రక్తపరీక్షల కోసం గర్భిణులు మొదటి అంతస్తు ఎక్కలేక నానా అవస్థలు పడేవారు. షిఫ్ట్ చేసిన నూతన వైద్యశాలలోనైనా మెరుగైన సేవలు అందుతాయని భావించారు. ఇక్కడ కూడా రక్తపరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి రావటంతో నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే రీతిలో వారి కష్టాలు ఉన్నాయి. రోజూ గైనిక్ విభాగానికి 400 మంది గర్భిణులు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. అందులో 150 మంది వరకు ప్రతి రోజు రక్త పరీక్షలు అవసరం అవుతుంటాయి. సోమ, శుక్రవారాల్లో మరో 50 మందికి అదనంగా మూత్ర, రక్త పరీక్షల కోసం వస్తుంటారు. లిఫ్ట్ ఉన్నప్పటికీ తరుచూ సాంకేతిక లోపం కారణంగా పనిచేయటం లేదు. కొన్ని సమయాల్లో విద్యుత్ కోత కూడా ఉంటోంది. నిండు గర్భిణులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రక్తపరీక్షల కేంద్రం వద్ద రద్దీ ఉండటంతో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. కూర్చునేందుకు సరిపడ కుర్చీలు లేకపోవటంతో సొమ్మసిల్లుతున్నారు.
తాగునీటికీ అవస్థలు
ఏరియా వైద్యశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. దాహర్తికి రోగులు, వారి సహాయకులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా క్యూలైనులో గంటలకొద్దీ నిలబడి దాహార్తికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. మోటార్ మరమ్మతుల కారణంగా గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రోగుల అవసరానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవటంతో వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారు. రోగులు తల్లడిల్లిపోతున్నా సమస్య పరిష్కారానికి అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు.


