నరసరావుపేట: ప్రాధాన్యత రంగాలకు, కౌలు రైతులకు 2026–27 మార్చి 31 నాటికి సకాలంలో రుణాలు అందించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బ్యాంకులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా డీసీసీడీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. గత ఏడాది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రొఫైల్‌ను ఆర్‌బీఏ ఎల్‌డీఎం ఎ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం జి.శరత్‌లు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఎంపీ లావు మాట్లాడుతూ రుణాలు విరివిగా ఇచ్చి పేదల అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు నిర్దేశిత రుణాలను ఇవ్వకపోవడంపై బ్యాంకుల నుంచి సమాధానం కోరారు. ఆర్‌బీఐ మేనేజర్ ఆర్.రవీంద్రబాబు జిల్లాలోని ప్రజలందరికీ లక్ష్యాల మేరకు రుణాలను అందించాలని కోరారు. ఆర్‌బీఐ అధికారి కిరణ్‌కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైల్వేలైను నిర్మాణంపై దృష్టి
పల్నాడు జిల్లాలో రైల్వేలైను నిర్మించడానికి 15 రోజుల్లో అన్ని శాఖల ఇంజినీర్లు అప్రూవల్స్, డీపీఆర్ మూడు రెవెన్యూ డివిజన్‌ల ఆర్‌డీఓలకు అందజేయాలని, వారంతా ఫీల్డ్‌కి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి, రైల్వేవారికి తగిన సహాయ సహకారాలు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రైల్వేశాఖ గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ పీవీ.నాయుడు, రైల్వే కన్సల్టెన్సీ సయ్యద్ చాన్‌బాషా, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై అధికారులకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ డీపీఆర్‌లు పూర్తిచేసి అప్రూవల్స్ వచ్చే విధంగా రైల్వే శాఖకు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు. మూడు రెవెన్యూ డివిజన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు రపాల్గొన్నారు.


