ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్‌ఐ నరహరి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక
గుంటూరు మెడికల్: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్ ఆరోగ్య మందిర్‌ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్‌క్యూఏఎస్) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్‌కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు.


