రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

● పచ్చిరొట్ట పైర్ల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి ● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి స్టాఫ్‌నర్సుల ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ

నాదెండ్ల: రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం వన్‌ మంత్‌ వన్‌ విలేజ్‌ ఫోర్‌ విజిట్స్‌ కార్యక్రమం చేపట్టిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ అన్నారు. నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతుల నుంచి 11 అర్జీలు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఫిర్యాదులను పారదర్శకంగా వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె బాలకృష్ణ, జిల్లా సర్వేయర్‌ భానుకీర్తి, తహసీల్దార్‌ కుటుంబరావు, మండల సర్వేయర్‌ రాంబాబు, వీఆర్వో రాధాకృష్ణ, గ్రామ సర్వేయర్‌ కల్యాణ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

భూసారాన్ని కాపాడితేనే రైతుకు లాభం

కొరిటెపాడు(గుంటూరు): అధిక దిగుబడుల మోజులో రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడితే భూమి సారం కోల్పోతుందని, రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగు వైపు మళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయం రైతుకు లాభాలు తెచ్చినా, అధిక దిగుబడుల లక్ష్యంగా రసాయన వినియోగం భూమిలో చౌడు పెరుగుతోందని, నీటిని నిల్వ చేసుకునే సామర్‌ాధ్యన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతుందని తెలిపారు. భూసారాన్ని పరిరక్షించేందుకు జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని సూచించారు. పచ్చిరొట్ట పైర్లను 40 నుంచి 50 రోజుల వరకు సాగు చేసి 50 శాతం పూత దశలో భూమిలో కలియదున్నాలని సూచించారు. దీంతో భూమిలోని పోషకాలు అందుబాటులోకి వస్తాయని, సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి నేల గుల్లబారి గాలి, నీటి ప్రసరణ మెరుగుపడుతుందని వివరించారు. పచ్చిరొట్ట పైర్లను వేసి సాగు చేసిన పంటల్లో నాణ్యత పెరగడమే కాకుండా 15 నుంచి 20 శాతం అదనపు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. భూసార పరిరక్షణలో రైతులుభాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గుంటూరు మెడికల్‌: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పటల్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును గురువారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్‌ జి.శోభారాణి తెలిపారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును cfw. ap. nic. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

సర్టిఫికెట్ల పరిశీలన...

పిడుగురాళ్ల గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పటల్‌లో పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి గురువారం గుంటూరు వైద్య కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి సర్టిఫికెట్లు పరిశీలించారు. గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పటల్‌లో 23 రకాల పోస్టులకు 206 మంది అభ్యర్థులను మెరిట్‌ ద్వారా ఎంపిక చేశారు. వీరిని కౌన్సెలింగ్‌కు పిలవగా, 36 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన అభ్యర్థుల పోస్టుల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఇతర అభ్యర్థులతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు భర్తీ చేస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి తెలిపారు. అభ్యర్థులకు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు.

నర్సింగ్‌ కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్‌ సీట్లు మంజూరు..

గోరంట్లలోని ప్రభుత్వ నర్సింగ్‌కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్‌ సీట్లు మంజూరు చేస్తూ హెల్త్‌ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ సర్వీస్‌ కోటాలో పది ఎమ్మెస్సీ నర్సింగ్‌సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పీజీ సెట్‌లో చలపతి ఫార్మసీ విద్యార్థికి రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు

గుంటూరు రూరల్‌: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఫార్మశీ కళాశాల విద్యార్థులు పీజీ సెట్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరచి సంస్థకు గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాదెండ్ల రామారావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్‌ పరీక్ష ఏప్రిల్‌ 28వ తేదీన జరిగిందని తెలిపారు. పీజీ సెట్‌లో తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించడం సంస్థలో అందిస్తున్న నాణ్యమైన బోధన విధానం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, అధ్యాపకుల అంకితభావం విద్యార్థుల కృషికి నిదర్శనమన్నారు. పరీక్షలో తమ కళాశాల విద్యార్థి బల్లా వెంకటజస్వంత్‌ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సంస్థకు విశిష్ట గౌరవాన్ని తీసుకువచ్చాడన్నారు. ఈ పరీక్షకు మొత్తం 42 మంది విద్యార్థులు హాజరుకాగా 42 మంది ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధిస్తూ సంస్థ ప్రతిష్టను మరింతగా పెంచాలని సంస్థ చైర్మన్‌ వై.వి.ఆంజనేయులు ఆకాంక్షించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement