చిలకలూరిపేట టౌన్ / యడ్లపాడు: గత రెండు రోజులుగా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను కుదిపేసిన డ్రైవర్ల ఆందోళన ఎట్టకేలకు శుభం కార్డు పడింది. చౌడవరం వద్ద డ్రైవర్ దుర్గాప్రసాద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ, తమకు రక్షణ కల్పించడంతోపాటు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 35 మంది కాల్ డ్రైవర్లు చేపట్టిన విధుల బహిష్కరణ బుధవారంతో ముగిసింది. జిల్లా రీజనల్ మేనేజర్ టి.అజిత కుమారి జరిపిన చర్చలు తొలుత విఫలమైనప్పటికీ, దాడికి పాల్పడిన వారిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేయడం, ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో డ్రైవర్లు శాంతించారు. బాధిత డ్రైవర్‌కు పూర్తి న్యాయం చేస్తామని ఆర్‌ఎం భరోసా ఇవ్వడంతో వారు తిరిగి బుధవారం విధుల్లోకి చేరినట్లు డిపో మేనేజర్ వై.వేణు తెలిపారు. డిపోనకు చెందిన అన్ని సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు రోజుల సమ్మె కారణంగా సకాలంలో సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇతర డిపోల నుంచి వచ్చిన డ్రైవర్లు విశ్రాంతి లేకుండా డబుల్ డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఐదు కీలక సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.


