అంగన్‌వేడి కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వేడి కేంద్రాలు

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

జిల్లాలో అంగన్‌వాడీ సమాచారం

సత్తెనపల్లి: భానుడి భగభగలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చిన్నారులు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి వేడిగాలులు మొదలు కావడంతో కేంద్రాల్లో ఫ్యాన్‌లు తిరుగుతున్నా చెమటలు పడుతున్నాయని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్‌ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పుల్లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్ట కష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

చాలీచాలని గదులు...

రాష్ట్రంలో దాదాపు అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా అంగన్‌వాడీ కార్యకర్తలకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

● పైపెచ్చు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయంతో చిన్నారులు సతమతమవుతున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు : 09

అంగన్‌వాడీ కేంద్రాలు : 2,031

గర్భిణులు : 9,548

బాలింతలు : 9,414

3 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు : 38,261

7 నెలల నుంచి మూడేళ్లలోపు

చిన్నారులు : 49,778

ఆరు నెలలలోపు చిన్నారులు : 9,453

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘ఉక్క’రిబిక్కిరి

కేంద్రాలకు సెలవులు ఇవ్వని

రాష్ట్ర ప్రభుత్వం

పక్క రాష్ట్రాల్లో ముందస్తు

చొరవ తీసుకున్న ప్రభుత్వాలు

జిల్లాలో రోజురోజుకు

పెరుగుతున్న ఎండలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో

అల్లాడిపోతున్న చిన్నారులు

Advertisement
 
Advertisement
Advertisement