● కారు – బైక్ ఎదురెదురుగా ఢీకొన్న
ఘటనలో ఇద్దరు యువకులు మృతి
● ముప్పాళ్ల మండలం బొల్లవరం
అడ్డరోడ్డు సమీపంలో ఘటన
● మృతులు ఇరువురూ స్నేహితులు
ముప్పాళ్ళ: కారు–ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న స్నేహితులైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని బొల్లవరం అడ్డరోడ్డు సమీపంలో బుధవారం జరిగింది. సంఘటన సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన గంపా ఆంజనేయరాజు(26), నాగార్జున నగర్‌కు చెందిన వేజెండ్ల ఇమేష్(24)లు ముప్పాళ్లలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని ముగించుకొని ద్విచక్రవాహనంపై సత్తెనపల్లికి బయలుదేరారు. సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై నాల్గవ మైలు మలుపు వద్దకు రాగానే సత్తెనపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ఉన్న ఇరువురు ఎగిరి రోడ్డు మార్జిన్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. కారు సైతం మార్జిన్‌లో ఉన్న చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కారులో నరసరావుపేట ఎన్‌ఈసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా సత్తెనపల్లి మండల పరిధిలోని గ్రామంలో జరిగిన ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తు న్నారు. కారు నడుపుతున్న బత్తుల అజయ్‌కుమార్ అనే విద్యార్థికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ముప్పాళ్ళ ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు...
మృతులు ఇరువురూ మంచి మిత్రులు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరి మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
ఇమేష్ (ఫైల్)
ఆంజనేయరాజు (ఫైల్)


