గరుడ పోటీలకు తెనాలి నాటికలు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

గరుడ పోటీలకు తెనాలి నాటికలు ఎంపిక

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

గరుడ పోటీలకు తెనాలి నాటికలు ఎంపిక

తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్‌ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్‌, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్‌ ఆర్ట్స్‌ శ్రీసరస్వతి శిశుమందిర్‌, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ స్కూల్‌ ఫౌండర్‌ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్‌ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్‌ఎం వలివేటి రాజేంద్ర కుమార్‌, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్‌ జానీబాషా, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్‌ అండ్‌ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్‌, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు.

వాసవి కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరంలో వస్త్ర దుకాణ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకానిరోడ్డులోని వాసవి కాంప్లెక్సులో ఉన్న దుర్గా సిల్క్స్‌ సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. గుంటూరు–2 అగ్నిమాపక శాఖ అధికారి పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. వాసవి కాంప్లెక్సులో అన్నీ వస్త్ర దుకాణాలే ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న సమయంలో దుకాణదారులు షాపు షట్టర్లు మూసివేయడంతో ప్రమాదం తప్పిది. దుకాణంలోని నాలుగు బ్లాకుల్లో మంటలు వ్యాపించడంతో వస్త్రాలు కాలిపోయాయి. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

రెంటచింతల: మండలంలోని పశర్లపాడులో ఈ నెల 27న పర్యటించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై బీరు సీసాలతో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున బుధవారం తెలిపారు. నిందితులైన పశర్లపాడు గ్రామానికి చెందిన జక్కి గోపాల్‌, రాజు ఇద్దరిని గురజాల కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

విజయపురిసౌత్‌: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు విజయపురిసౌత్‌ ఎస్‌ఐ అశోక్‌ బుధవారం తెలిపారు. మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ మన్నే లక్ష్మణ్‌, చింతల తండాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలికను వేధిస్తున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లి విజయపురిసౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement