పెదకాకాని: రాజధాని ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ సహోద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పట్ల మరో విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉబైద్ ముస్తాఖ్ గత కొంతకాలంలో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, ఇంటికి ఆహ్వానించాలని ఒత్తిడి చేయడం, వానిష్‌మోడ్ ఫ్యూచర్‌ని ఉపయోగించి ఖాతా నెంబర్‌కు మెసేజ్‌లు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇరువురూ పెదకాకాని మండలంలోని నంబూరు ఏరియాలోని బహుళ అంతస్తుల సముదాయంలో ఉంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి తెలిపారు.
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్ బుధవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం నివేదిస్తామని ఆయన తెలిపారు. ఒక బిందెకు రూ. 40, 11 బిందెలకు రూ. 440, 27 బిందెలకు రూ. 1080, 108 బిందెలకు రూ. 4320, 365 బిందెలు (రోజుకు ఒక బిందె చొప్పున సంవత్సరానికి) రూ. 14,600 లతో పథకాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు పొందేందుకు ఆర్జిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఊంజల్ సేవ, బంగారు గరుడోత్సవం, పెద్ద శేషవాహనం, చిన్నశేష వాహనం సేవలకు రూ.5 వేల చొప్పున, సుదర్శన హోమం, నరసింహ హోమం, లక్ష్మీ హోమానికి రూ. 3500 చొప్పున, శాంతి కల్యాణం రూ. 1500, నిత్య గోత్ర నామార్చనకు (సంవత్సరం) రూ. 516 గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్జిత సేవల కోసం రుసుము చెల్లించుటకు ఆన్‌లైన్ ద్వారా ‘సిటీ యూనియన్ బ్యాంక్, మంగళగిరి శాఖ, అకౌంట్ నెం. 500 101 014 411 599, ఐఎఫ్‌ఎస్‌సీ సీఐయూబీ 0000 688’కు చెల్లించవచ్చని తెలియజేశారు. నిత్యాన్నదాన ప్రసాదాలకు విరాళాలు ఇచ్చే వారు మహారాజ పోషకులు రూ. 1,01,116 పైన, రాజపోషకులు రూ. 50,116 పైన, పోషకులు రూ. 25116 పైన, ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవారు రూ. 10116 గా నిర్ణయించామని వివరించారు. విరాళాలు ఆన్‌లైన్ ద్వారా ‘మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెం. 500 101 042 919 33, ఐఎఫ్‌ఎస్‌సీ సీఐయూబీ 0000 686’లో చెల్లించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


