క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్‌

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

నగరంపాలెం: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన తొమ్మిది మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షలు, ఏడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... సోమవారం రాత్రి శ్రీరామ్‌నగర్‌ ఒకటో వీధిలోని వెంకటేశ్వర టీ స్నాక్స్‌ దుకాణం వెనుక ఖాళీ స్థలంలో ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారంతో నగరంపాలెం పీఎస్‌ సీఐ సత్యనారాయణ తనిఖీలు చేశారు. తనిఖీల్లో వర్రా మణికంఠ (ఏటీ అగ్రహారం 12వ వీధి), రామిశెట్టి సురేష్‌ (నెహ్రూనగర్‌ ఆరో వీధి), కాసినేడి నటరాజ్‌కుమార్‌, కుంచాల సాయికుమార్‌, బొడ్డు ఇస్సాక్‌ (శ్రీరామ్‌నగర్‌ ఒకటో వీధి), షేక్‌.బాజీ (రామిరెడ్డినగర్‌ 4వ వీధి), పైడి ఎర్రంనాయుడు, పైడి అశిరినాయుడు (శ్రీరామ్‌నగర్‌ రెండో వీధి) యంపటి కోటిరెడ్డి (ఎన్‌జీవో కాలనీ)లను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి, ఏడు సెల్‌ఫోన్లు, రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ తొమ్మిది మంది ఆన్‌లైన్‌లో ఏపీబుక్‌.ఇన్‌, లక్కీ కిస్మత్‌.కామ్‌, గల్లీబెట్స్‌.ఇన్‌, వీల్‌బుక్‌.కామ్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారని అన్నారు. క్రికెట్‌ను ఆటగా వీక్షించాలని, ఎవరూ జూదంగా మార్చవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసుని ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు రాంబాబు, ఎ.రామచంద్రరెడ్డి, కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పి.గంగరాజు, సీహెచ్‌.ఉదయచంద్‌, షేక్‌ షకీల్‌ అహ్మద్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement