చోరీ సొత్తు కలిగి ఉన్న వ్యక్తులకు జైలు | - | Sakshi
Sakshi News home page

చోరీ సొత్తు కలిగి ఉన్న వ్యక్తులకు జైలు

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

చోరీ సొత్తు కలిగి ఉన్న వ్యక్తులకు జైలు రైలులో వివాహితపై లైంగికదాడి పిడుగుపాటుకు పూరి గుడిసె దగ్ధం అట్రాసిటీ కేసుపై విచారణ

నరసరావుపేట టౌన్‌ : చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరంలో మండలంలోని బసికాపురం గ్రామంలో వేంపూడి అనంతమ్మ మెడలోనీ బంగారు గొలుసును ముగ్గురు ఆగంతకులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్‌, ఉయ్యాల విష్ణు, పాలపర్తి ప్రవీణ్‌లను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది.

రెంటచింతల: పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ వివాహితపై కొద్దిరోజుల కిందట లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవనోపాధి కోసం భార్యాభర్తలు కొంతకాలంగా విశాఖ పట్టణంలో జీవిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఆ వివాహిత విశాఖ–నడికుడికి టికెట్‌ తీసుకుని విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. జనరల్‌ భోగీలో ప్రయాణిస్తున్న ఈ మహిళను గుర్తు తెలియని వ్యక్తి ఏసీ భోగీలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాధిత మహిళ రెంటచింతల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెల్దుర్తి: మండలంలోని లోయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. లోయపల్లి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకాసినంతరం, మధ్యాహ్నం 3గంటల తరువాత మాచర్ల నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో మాత్రం దాని ప్రభావం కారణంగా పలుమార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో లోయపల్లి గ్రామంలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె మీద పిడుగు పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. రోజువారీ పనులు చేసుకొని జీవించే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో నిలిచారు. తహసీల్దార్‌ రాజశేఖర్‌ నాయక్‌ వచ్చి పరిశీలించి కుటుంబ సభ్యులకు రోజు వారీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

వేమూరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ జరిపినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. వేమూరు మండం కాకర్లమూడి గ్రామంలో జగనన్న కాలనీలో కాపు కులానికి చెందిన సాయిలక్ష్మి, ఎస్టీ కులానికి చెందిన మొగలి వెంకటేశ్వర్లు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన ఇద్దరూ మురుగు నీరు, నడక దారి వద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు కొట్టుకున్నారు. బొల్లిముంత సాయిలక్ష్మి, వేమూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొగలి వెంకటేశ్వరరావు కులం పేరుతో ధూషించి, కొట్టినట్లు సాయిలక్ష్మిపై ఫిర్యాదు చేశాడు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు మంగళవారం కాకర్లమూడి గ్రామం వెళ్లి విచారణ చేసినట్లు డీఎస్సీ తెలిపారు. విచారణ తర్వాత అట్రాసీటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement