బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించిన గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ కాజా, వెంకటాయపాలెం టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల పరిశీలన
తాడికొండ: మంగళగిరి– తుళ్లూరు మండలాల పరిధిలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి కీలక ప్రమాద ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్‌లోని మురుగన్ హోటల్ సమీప ప్రాంతం, వెంకటాయపాలెం టోల్‌ప్లాజా, సీడ్ యాక్సెస్ రోడ్లను సందర్శించి, అక్కడి రోడ్డు పరిస్థితులు, వాహన రాకపోకలు, ప్రమాదాలకు దారితీసే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు వేగాన్ని తగ్గించేలా అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ముందస్తు హెచ్చరికగా ప్రతిబింబించే (రిఫ్లెక్టివ్) సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించేందుకు హైమాస్ట్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని, టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పీడ్ గన్‌్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు.


