ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ప్రైవేటు ఉపాధ్యాయులకు సీవీ రామన్‌ ప్రతిభా పురస్కారాలు ప్రదానం

లక్ష్మీపురం: విద్యారంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ప్రైవేటు టీచర్స్‌, లెక్చర్స్‌, ప్రొఫెసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రైవేటు టీచర్లకు సీవీ రామన్‌ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్‌ కన్వీనర్‌ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం 1.20 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. కానీ వారిలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం చేపట్టాల్సిన చర్యలేవీ చేపట్టట్లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగం శరవేగంగా పెరుగుతుందని, కానీ టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ఎం.సూర్యారావు మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం తమ అసోసియేషన్‌ నిరంతరంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ ఆర్గనైజెంగ్‌ సెక్రటరీ ముజఫర్‌ అహ్మద్‌, పిటిఎల్‌పిడబ్ల్యూఎ రాష్ట్ర నాయకులు కిరణ్‌, శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీనిను, శ్రీవాణి, సదరన్‌ ప్రైవేటు టీచర్స్‌ అసోసియేసన్‌ అధ్యక్షులు డాక్టర్‌ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement