వినుకొండ: మండల పరిధిలో కౌజుల వాగు వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై వినుకొండ పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో మట్టిని తరలిస్తున్న మూడు భారీ లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా వివరాల్లోకి వెళ్తే... వినుకొండ మండలం తిమ్మాపాలెం మరియు శ్రీరాంపురం గ్రామాల మధ్య ఉన్న కౌజుల వాగు నుంచి సోమవారం రాత్రి నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సీఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం రాత్రి సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను అధికారులు గుర్తించి వాటిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సహజ వనరులను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని, ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ ఘటనపై వినుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్
గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్‌లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు స్పా సెంటర్‌లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్‌ఫోన్‌లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.


