నకరికల్లు: ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన సంఘటన మండలంలోని తురకపాలెం సమీపంలో జరిగింది. ఎస్‌ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. మండలంలోని రూపెనగుంట్ల గ్రామానికి చెందిన గోగా రామ సుబ్బారావు (42) ట్రాక్టర్ నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ తురకపాలెం సమీపంలోని పిల్లవాగులో బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలపాలైన సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి
బాపట్ల: రైతులకు డీజిల్ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ భావన వశిష్టను మంగళవారం ఆయన కలిశారు. మొక్కజొన్న రైతులకు ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయని, జిల్లాలో 1700 కుటుంబాలు మొక్కజొన్న సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన పనులకు డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పె పూర్ణచంద్రరావు, రాష్ట్రకార్యదర్శి ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.


