గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్–3లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. స్వర్ణభారతినగర్ ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్–3 బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. గతంలో సుమారు 300 ఇళ్లను కూల్చివేశారని, నేటికీ వారికి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కాని ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఎందరో చిన్నపిల్లలతో రోడ్డున పడ్డారని వాపోయారు. కొంత మందికి ఇళ్ల స్థలాలను లాం తదితర ప్రాంతాల్లో చూపారని కానీ అక్కడ ఇప్పటికే గతంలో స్థలాలు కేటాయించగా అందులో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని వాపోయారు. వాళ్లు ఉంటున్న స్థలాలు మరలా మాకు ఇచ్చి మమ్మల్ని ఉండమంటే ఏవిధంగా న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారతినగర్ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


