‘చమురు’ వదులుతోంది....
మూడు రోజులుగా వేధిస్తున్న డీ జిల్ కొరత ఇంటి వద్దే నిలిచిన ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న రవాణా వాహనదారులు, సిబ్బంది బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న బంక్ యజమానులు జిల్లా వ్యాప్తంగా నాలుగు బంకులు సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు అధికారుల పర్యవేక్షణలోనే డీజిల్, పెట్రోల్ విక్రయాలు పూర్తి స్థాయిలో రైతులకు అందని డీజిల్
వాహనాలు పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు
సాక్షి, నరసరావుపేట: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కష్టాలు మంగళవారం కొనసాగాయి. ఆదివారం, సోమవారాలతో పోల్చితే తెరుచుకున్న పెట్రోల్ బంకుల సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఇంధన సరఫరా జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ సరఫరా రేషన్ పద్ధతిలో పంపిణీ జరుగుతుండగా.. మంగళవారం సైతం జిల్లాలో చాలా బంకుల్లో డీజిల్ పంపిణీ నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో లేదని, నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో ఆటో, సరుకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాల బతుకు చక్రాలు కదలని పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు రోజులుగా వాహనాలకు సరిపడా ఇంధనం దొరక్క ఇంటి వద్దే నిలిచిపోయాయి. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఇంధన సరఫరా జరుగుతోంది. అధికారులు వెళ్లగానే బంక్‌లో ఆయిల్ లేదంటూ వాహనాలకు నింపడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఒక్కోక్కరికి పది లీటర్ల వరకు డీజిల్ సరఫరా చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో ఆయిల్ అందుబాటులో లేక సాగు పనులు వాయిదా పడుతున్నాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్‌ఓ పర్యవేక్షణలో నడుస్తున్న పెట్రోల్ బంకులో మంగళవారం సైతం ఆయిల్ అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు.
నాలుగు బంకులు సీజ్
ఓ వైపు కంపెనీలు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదని అంటూనే.. మరో వైపు స్థానిక పెట్రోల్ బంక్ యజమానులు డీజిల్ డిమాండ్ ఆధారంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లీటర్ డీజిల్‌కు రూ.40 వరకు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టిన విషయం తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం నాలుగు పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌లను సీజ్ చేశారు. కలెక్టర్ మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు బంకులను స్వయంగా తనిఖీ చేశారు. అధికారుల పర్యవేక్షణలోనే ఇంధన సరఫరా జరుగుతుందన్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న రొంపిచర్లలోని మురళీధర ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ సీజ్ చేశారు.
ప్రతి ఏడాది 40 ఎకరాల విస్తీర్ణంలో మెట్ట, మాగాణిలో వివిధ పంటలను సాగు చేస్తా. పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర కోసమో, కొనుగోలు కేంద్రాల కోసమో రైతులు రోడ్డెక్కడం చూస్తుంటాం. విచిత్రంగా ఈసారి సాగు ప్రారంభానికి ముందే సమస్యలు చుట్టుముట్టాయి. అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోంది. డ్రైవర్ల కొరతతో ఒకవైపు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఇంధన కొరత తోడవ్వడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.
– ఘంటా రాము, రైతు,
జాలాది గ్రామం, యడ్లపాడు మండలం
నరసరావుపేటలో పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో రాలేదు. కొన్ని బంకుల్లో ఒక్కో వాహనానికి రూ.1,000 డీజిల్ పోస్తుండగా మరికొన్నింటిలో పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని చెబుతున్నారు. పది లీటర్ల డీజిల్‌తో వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో నా మినీ లారీ తునిలో గోతాల లోడ్ ఉన్నప్పటికీ దారిలో డీజిల్ దొరకదన్న భయంతో నరసరావుపేటకు రాకుండా అక్కడే నిలుపుకొని ఉన్నా. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలు కిస్తీలు కట్టలేక, కుటుంబాలకు కష్టాలు తప్పవు.
– గోతాల బాజీ,
మినీ లారీ ఓనర్, నరసరావుపేట


