మట్టి, మద్యం, సెటిల్‌మెంట్లతో అక్రమార్జన జూలకంటి ప్రైవేట్ సైన్యంతో నిత్యం అరాచకాలు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత దాన్ని తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ రుజువులతో వస్తా.. బహిరంగ చర్చకు సిద్ధమా? ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దు ఎమ్మెల్యేకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరిక
మా పార్టీకి సంబంధమేంటి?
మాచర్ల: ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేక చిల్లర రాజకీయాలు చేస్తూ తన వక్రబుద్ధిని జూలకంటి బ్రహ్మారెడ్డి బయటపెడుతున్నారని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జూలకంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. ప్రైవేటు సైన్యంతో దాడులు చేయించుకొని బినామీలతో అక్రమ సంపాదన చేకూర్చుకుంటూ తమ పార్టీపై నిందలు వేసి బతుకుతున్నారని పేర్కొన్నారు. అక్రమ మద్యం, బెల్టుషాపులు, గ్రావెల్‌తోపాటు అనేక అక్రమాలు చేయిస్తూ ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్లీ తీసుకురావడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేతకానితనం వలన వారి పార్టీలో అంతర్గత పోరు కారణంగా గుండ్లపాడు, అడిగొప్పలలో హత్యలు జరిగాయని తెలిపారు. తమకు సంబంధం లేని కేసులో అక్రమంగా జైలుకు పంపి, పైకి శాంతి వచనాలు చెబుతున్నారని మండిపడ్డారు.
బహిరంగ చర్చకు సిద్ధం..
మాట్లాడితే మగతనం, దమ్ము అని ఎమ్మెల్యే అంటున్నారు... 2009లో ఓడిపోయిన తరువాత 15 ఏళ్లు ఎక్కడ దాక్కున్నారో తెలియదా? ఎవరో మద్యం తాగి బాటిల్ విసిరేస్తే అది వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. ఇలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెచ్చగొట్టేలా వ్యవహరించి డైవర్షన్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. గుంటూరులో స్కూటర్ మీద తిరిగి, అడవుల్లో ఆకులు తెచ్చి, కార్ఖానా పెట్టి బతికిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంత లగ్జరీగా ఉన్నారో అందరికీ తెలుసు. రెండేళ్లలో గుంటూరు, హైదరాబాద్‌లో ఎన్ని ఆస్తులు సంపాదించారో చెప్పమంటారా? ఎమ్మెల్యే తల్లి అధికారంలో ఉన్నప్పుడు 7 హత్యలు చేసిన చరిత్ర ఉంది కదా? నువ్వే దాడి చేయించి ఎదుటివారిపై నింద వేస్తూ, సినిమా స్క్రిప్ట్ తయారు చేయించి నటించడం సాధారణంగా మారింది. ఎమ్మెల్యేకు 45 ఏళ్ల రాజకీయం ఉందని చెబుతున్నారు... మరి అధికారంలో ఆయన ఏం చేశారో చెప్పాలి. గుండ్లపాడు పట్లవీడు, రచ్చమల్లపాడు, మర్సపెంటలో ఎమ్మెల్యే దాడులు చేయించిన సంఘటన మర్చిపోయారా? మేం 20 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. విద్యాసంస్థలు, జాతీయ రహదారులు, వరికపూడిసెల అనుమతులు, ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, విద్యుత్ సబ్ స్టేషన్లు తెచ్చాం. ఎమ్మెల్యే సొంత ఊరుకు తిరుగుతున్న రోడ్డు కూడా మా ప్రభుత్వ హయాంలో వేయించిందే. రూ. 3,045 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం చేశాం. గణాంకాలతో చెబుతా. ఎక్కడికి వస్తారో ఎమ్మెల్యే చెబితే బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీకి వరికపూడిసెల గురించి మాట్లాడే హక్కు లేదు. 1996లో శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు సాధ్యం కాదన్న చరిత్ర వారిది. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో అనుమతులు తెచ్చాం. ఆట మొదలుపెడతా.. అందరి సంగతి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. పోలీసు వ్యవస్థను కూడా సొంత అవసరాల కోసం ఉపయోగించుకొని భ్రష్ఠు పట్టించారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మారాలని’’ హితవు పలికారు.
ఇంకా పిన్నెల్లి మాట్లాడుతూ... ‘‘మేం చట్టాన్ని నమ్ముతాం. ఎమ్మెల్యేలా పైకి శుద్ధ మాటలు చెప్పి లోపల ప్రైవేటు సైన్యం ద్వారా దాడులు చేయించటం మా నైజం కాదు. వైఎస్సార్ స్టిక్కర్ బైకుపై ఉందని ప్రైవేటు సైన్యంతో దాడి చేయించలేదా? దుకాణాలు, రెస్టారెంట్లుపై దాడులు ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరగలేదా? వీటితో టీడీపీలోనే బ్రహ్మారెడ్డికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని తప్పించుకునేందుకు దాడి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నిన్న పశర్లపాడు గ్రామంలో 20 ఏళ్ళ కుర్రాడు మద్యం తాగి పరస్పరం ఘర్షణ పడ్డారు. బాటిళ్లు విసురుకుంటే అది వైఎస్సార్‌సీపీకేం సంబంధం? గ్రామాల్లో అక్రమ మద్యం దొరికేలా చేసింది స్వయంగా ఎమ్మెల్యేయే. జూలకంటి కాన్వాయ్ మీద బీరు బాటిల్ పడిందని చిల్లర రాజకీయాలు చేయడమేంటి?


