మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నృసింహుని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో మంగళవారం ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచసూక్త హోమం అనంతరం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లు ఈవో సునీల్‌కుమార్ పర్యవేక్షించారు.
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత రంగనాయకస్వామి ఆలయం వార్షిక కల్యాణ మహోత్సవం రెండోరోజైన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుంచి స్వామి వారికి గ్రామ బలిహరణ, హోమం, రంగనాయక స్వామి సహస్ర నామార్చన, రాత్రికి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్, భక్తులు భాగస్వాములయ్యారు.
నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు విశ్వనాఽథ్ ఆధ్వర్యంలో లక్ష మలెలతో పూజ చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం, కోట శేషగిరిరావు, జుజ్జూరి శ్రీనివాసరావు, యక్కల నాగభూషణం, మాగులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రబాలెం(క్రోసూరు): వేసవి తాపానికి అడవి నుంచి తప్పిపోయి జనసంచారంలోకి వచ్చిన జింక బిక్కుబిక్కుమంటూ బావిలో పడింది. స్థానికులు చూసి రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పొలాలలో ఈ సంఘటన చోటుచేసుకుందని ఎస్‌ఐ రవిబాబు తెలిపారు. జింకను పిడుగురాళ్ల అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


