బాపట్ల టౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుడిన ఘరానా దొంగల ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జనవరిలో చీరాల మండలం, గాంధీనగర్ ఎంజీహెచ్ కాలనీలో బచ్చు వెంకట సుబ్బసత్య రామాంజనేయులు ఇంటిలోకి ముగ్గురు ప్రవేశించారన్నారు. రామాంజనేయులతోపాటు ఏపీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చెల్లిపై దాడి చేసి వారి నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు చీరాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారన్నారు. అదే తరహాలో రాష్ట్రంలోని బాపట్ల, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో నేరాలు జరిగాయని తెలిపారు. దీంతో వేలిముద్రలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోలి బోయిడా గ్రామానికి చెందిన భురు మక్వానా, జుందాం గ్రామానికి చెందిన రమేష్ మాచర్, భూటియా గ్రామానికి చెందిన సంతోష్ భూరియాలను నిందితులుగా గుర్తించామన్నారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే ఇదే తరహాలో మొత్తం 18 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. వాటిలో బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి, ఒంగోలు తదితర మొత్తం 10 ప్రదేశాల్లోరీ నేరాలు చేసినట్లు వారు అంగీకరించారన్నారు. వారి నుంచి 137 గ్రాముల బంగారం, 1.50 కేజీల వెండి వస్తువులు, రూ. 5 లక్షల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి మొత్తం విలువ రూ. 30.88 లక్షలు ఉంటుందన్నారు. కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన సీసీఎస్, చీరాల సబ్ డివిజన్, ఐటీ కోర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


