అవయవదానం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అవయవదానం అభినందనీయం

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

అవయవదానం అభినందనీయం

తాడేపల్లిరూరల్‌: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్‌ హాస్పిటల్‌ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్‌ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్‌లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్‌ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్‌డెడ్‌గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.రాంబాబు, హాస్పిటల్‌ డైరెక్టర్‌ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్‌ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

దుర్మరణం

నల్లగొండ: కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు వద్ద సోమవారం జరిగింది. నల్లగొండ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్‌ సాయిసందీప్‌(28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవులు ఉండడంతో ఈ నెల 25న స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. కాగా.. చైన్నె నుంచి బొగ్గులోడుతో వస్తున్న లారీ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే టైరు పగిలిపోవడంతో ఎటువంటి లైట్లు వేయకుండా డ్రైవర్‌ లారీని రోడ్డుపైనే నిలిపివేశాడు. అదే సమయంలో కారులో వస్తున్న సాయిసందీప్‌ లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయిసందీప్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న నల్లగొండ టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

గుంటూరు రూరల్‌: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఇంచార్జి సౌత్‌ డీఎస్పీ బివి.మధుసూదన్‌రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement