పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం
గుంటూరు రూరల్: కూలీనాలీ చేసుకుని ఒక పూట తిని మరోపూట పస్తులుండి దాచుకున్న డబ్బుతో ఇళ్ళు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్ 3 పేరుతో పేదల ఇళ్ళను కూల్చి రోడ్డున పడేశారని స్వర్ణభారతినగర్ 20వ లైను బాధితులు వాపోయారు. సోమవారం ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్ 3లో నగర మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పోలీసుల అండతో ఇళ్ళ కూల్చివేతకు పూనుకున్నారు. ఫేజ్ 3కి చెందిన బాదితులు కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాలవద్దకు వెళ్ళగా అక్కడ వేరేవాళ్ళు ఇళ్ళు నిర్మించుకుని నివశిస్తుండటంతో తాము మోసపోయామని వాపోతున్నారు. ఒకే స్థలాన్ని నలుగురు ఐదుగురికి కేటాయించి బాధితులను మోసం చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్ళను కూల్చినవారికి ప్రత్యామ్నాయం చూపే వరకూ అద్దెగా నెలకు రూ 3000 చెల్లిస్తామని చెప్పి ఇళ్ళను కూల్చివేశారు. కానీ నేటికి అతీగతి లేదని అద్దె ఇవ్వక పోగా ఇళ్ళు లేక రోడ్డున బతుకుతున్నామని బాధితులు వాపోతున్నారు.
పత్నామ్నాయం చూపకుండా
రోడ్డున పడేశారంటున్న బాదితులు
బాధితులకు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు ఇంచార్జ్ బలసాని భరోసా
స్వర్ణభారత్ నగర్ కాలనీ 20వ లైన్‌లో గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను, హైవే పనులకు అడ్డంగా ఉన్నాయని ఎటువంటి సమాచారం లేకుండా కూల్చి వేయటం దుర్మార్గపు చర్య. అని వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ధ్వజమెత్తారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కనీసం బాధితులకు నిలువ నీడను కూడా చూపకుండా ఇళ్ళను కూల్చివేయటం కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం పేదలను ఆదుకోలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే పునరావం అందించాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి తగిన స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


