పోలీసుల అదుపులో గంజాయి ముఠా | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో గంజాయి ముఠా

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

నగరంపాలెం: గంజాయి ముఠాను మంగళగిరి గ్రామీణ పీఎస్‌, దుగ్గిరాల పీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయా కేసుల్లో నిర్వాహాకులు, 11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్‌ ఉండగా, సుమారు 4.6 కిలోల గంజాయి, రూ.3,600 స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మంగళగిరి, విజయవాడలోని యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయించే ముఠాను మంగళగిరి రూరల్‌ పోలీసులు గుర్తించారని అన్నారు. మంగళగిరిలో ఉంటున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన రావి మహేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతనిపై 12 కేసులు ఉన్నాయని, అందులో పీడీ యాక్ట్‌ ఉందన్నారు. అనీల్‌పై తాడేపల్లి పీఎస్‌లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. అతని అనుచరులు పాడేరు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, వాటిని చిన్న ప్యాకెట్లగా చేసి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించే వారని చెప్పారు. వీరిలో శశి అనే అతనికి చాన్నాళ్లుగా ఇదే వ్యాపారమని అతనిపై ఐదు కేసులు ఉన్నాయని అన్నారు. సోమవారం చినకాకాని వద్ద నలుగురు నిర్వాహాకులు, కాజ గ్రామంలో గంజాయి తాగే 11 మందిని అరెస్ట్‌ చేశారని అన్నారు. అలాగే దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 15 మందిని అరెస్ట్‌ చేశారని అన్నారు. వీరంతా మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా, అమరావతికి చెందిన వారని చెప్పారు. గంజాయి తాగడం, ఆర్థిక అవసరాలకై గంజాయి వ్యాపారం చేసేవారని అన్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించేవారని అన్నారు. చిలువూరు గ్రామం వద్ద 15 మందిని అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ 27 మందిలో 11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్‌ ఉన్నారన్నారు. ఈ కేసుని చేధించిన మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి గ్రామీణ పీఎస్‌ సీఐ ఏవీ.బ్రహ్మం, ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌, దుగ్గిరాల పీఎస్‌ ఎస్‌ఐ వెంకటరవి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు.

చిన్న ప్యాకెట్లుగా చేసి క్రయ విక్రయాలు

పాడేరు, రాయగడ నుంచి మంగళగిరికి రవాణా

11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్‌

Advertisement
 
Advertisement
Advertisement