నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా పరిధిలో 27 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి శిబిరంలో 30 మంది చొప్పున 8 నుంచి 14 సంత్సరాల వయస్సు గల బాలబాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తారని వివరించారు. ప్రతి మండలంలో ఒక శిబిరం, మున్సిపాలిటీలలో రెండు శిబిరాలకు అనుమతించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఐదు శిక్షణ కేంద్రాలను డీఎస్‌ఏ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా శిబిరాలలో ఆట్యాపాట్యా, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, రెజ్లింగ్, క్రికెట్ తదితర 14 క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. ఈఏడాది శాప్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శిబిరంలో మెరుగైన ప్రదర్శన చేసిన చిన్నారులను అకాడమీల ద్వారా మరింత శిక్షణ ఇచ్చి ప్రతిభ గల క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. శిబిర నిర్వాహకులు, శిక్షణకు హాజ రయ్యే క్రీడాకారులు తమ వివరాలను క్రీడా యాప్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. కాగా, ప్రతి శిబిరానికి వారు శిక్షణ ఇచ్చే క్రీడాంశాలు, క్రీడాకారుల నమోదు మేరకు శాప్ ఆయా క్రీడలకు సంబంధించిన క్రీడా సామాగ్రి అందచేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో స్టెప్ సూపరింటెండెంట్ పి.వి.రమణ, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్, స్టేడియం, సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి
జిల్లాలో 27 శిబిరాలు ఏర్పాటు


