నృసింహుని గరుడ సేవ | - | Sakshi
Sakshi News home page

నృసింహుని గరుడ సేవ

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణ పరిధిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామి వారికి అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, నారసింహ మూల మన్య హోమం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రణయనం, కుమ్భారాధన, నారసింహ హోమం అనంతరం స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వైభవంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం

రెంటచింతల: ఆర్యవైశ్యుల ఇలవేల్పు, జగజ్జనని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో గ్రామ పురవీధులలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. సోమిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం ప్రదర్శించారు. దేవస్థానం చైర్మన్‌ నాళం చినబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చెన్నకేశవ స్వామిని తాకిన సూర్య కిరణాలు

వేమూరు: జంపని గ్రామంలో వేంచేసి ఉన్న భూసహిత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం మూలవిరాట్‌ స్వరూపం చెన్నకేశవుడిని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కీరీటం వరకు స్వామి వారిని 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచూ స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు.

రేపటి నుంచి చందోలు బగళాముఖి అమ్మ తిరునాళ్ల

చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల ఈనెల 29 నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరవుతారని తెలిపా రు. మే 2వ తేదీన బగళా ముఖి అమ్మవారికి ప్రాచీన కాలంనాటి బంగారు ఆభరణాలు అలంకరణ చేయటం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన పలు గ్రామాల నుంచి భక్తులు భారీ విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేసుకుని పసుపు బండ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయమట్టం సోమవారం 525.80 అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది.దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement