కారెంపూడి: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాల బ్యాగ్‌ను దోపిడీ చేసిన ఘటన కారెంపూడిలో సోమవారం పట్టపగలు జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన యక్కల శ్రీనివాసరావు అనే బంగారు నగల వ్యాపారి ఆభరణాలను జ్యూవెలరీ షాపులకు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కారెంపూడి వచ్చాడు. ప్రధాన రహదారి కొట్ల బజారులో నగల బ్యాగ్‌తో వెళ్తుండగా దుండగులు విత్తనాల షాపుల వద్దదాడి చేశారు. కొడుతున్న వారి నుంచి తప్పించుకుని ఆంఽధ్రాబ్యాంక్ సందులోకి పరుగుతీశాడు. మళ్లీ ఆయనను వెంబడించి ఏటీఎం వద్ద మళ్లీ దాడి చేశారు. వ్యాపారిని కిందపడేసి కొట్టి నగల బ్యాగ్‌ను లాక్కుని బైక్‌పై పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ షాపుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. రెండు బైక్‌లపై నలుగురు దొంగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మెయిన్ రోడ్డులో తప్పించుకుని బ్యాంక్ సందులోకి వెళ్లిన తర్వాత వెనుక నుంచి ముందు వైపు నుంచి దొంగలు ఎటాక్ చేసినట్లుగా దృశ్యాలున్నాయి. పోయిన నగలు ఎంతనేది తెలియాల్సి ఉంది. బాధితుడు శ్రీనివాసరావు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురజాల డిఎస్పీ మహేశ్వరరావు, సీఐ శరత్‌బాబు, ఎస్‌ఐ వాసు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు. సోమవారం ఎరువుల దుకాణాలు బంద్ పాటించడంతో మూడువంతుల షాపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అడపాదడపా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయినా దొంగలు యథేచ్ఛగా తమ పని ముగించుకు వెళ్లిపోయారు.


